Dinesh Karthik : టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు సొంతగడ్డపై తొలి సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ముగిశాక.. రోహిత్ శర్మ బృందానికి నవంబర్‌లో అసలైన సవాల్ ఎదురుకానుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy 2024-25) కోసం ఆస్ట్రేలియాకు టీమిండియా వెళ్లనుంది. ఈ ట్రోఫీపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు దినేశ్ కార్తిక్(Dinesh Karhik) జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిడిలార్డర్‌లో నయావాల్ ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara), అజింక్యా రహానే(Ajinkya Rahane)ల స్థానాల్ని యువ క్రికెటర్లతో భర్తీ చేయాలని కార్తిక్ అభిప్రాయపడ్డాడు.
మిడిలార్డర్‌లో గోడలా నిలబడే సీనియర్ ఆటగాళ్లు అయిన పుజారా, రహానేలు జట్టుకు దూరమై ఏడాది దాటింది. దాంతో, వాళ్లు ఈసారి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆడడం అనుమానమే. దాంతో, ఆ ఇద్దరి స్థానాల్లో ఎవరిని ఆడించాలి? అనే చర్చ నడుస్తోంది. అనుభవజ్ఞులైన ఈ ఇద్దరి లోటును కుర్రాళ్లు శుభ్‌మన్ గిల్ (Shubman Gill), సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)లతో భర్తీ చేయాలని కార్తిక్ సూచించాడు. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గిల్, సర్ఫరాజ్‌లు అద్భుతంగా రాణించారు.
సర్ఫరాజ్, శుభ్‌మన్ గిల్
వీళ్లిద్దరూ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తారని నాకు నమ్మకం ఉంది. ఈ ఇద్దరూ రహానే, పుజారా స్థానాల్ని భర్తీ చేయగల సమర్థులే. అయితే.. అది కొంచెం కష్టమే. కానీ.. గిల్, సర్ఫరాజ్‌లకు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల దమ్ము, ధైర్యం ఉన్నాయి అని కార్తిక్ వెల్లడించాడు.
టెస్టుల్లో భారత జట్టు చిరస్మరణీయ విజయాల్లో కొన్ని ఏండ్లుగా పూజరా, రహానేలు భాగమవుతూ వచ్చారు. 2019-19లో ఆసీస్ గడ్డపై పూజారా 521 పరుగులతో తడాఖా చూపించాడు. ఇక 2020–21 సిరీస్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో రహానే సెంచరీతో జట్టును గెలిపించాడు. మిడిలార్డర్‌కు వెన్నెముకలా నిలిచిన ఈ ఇద్దరి స్థానాల్ని భర్తీ చేయడం కుర్రాళ్లకు సవాలే.
ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదు టెస్టు మ్యాచ్‌లుగా జరుగనుంది. 1992 తర్వాత ఇరుజట్లు ఐదు టెస్టుల సిరీస్ ఆడడం ఇదే తొలిసారి. ఈ ఏడాది నవంబర్ 22న తొలి టెస్టు మొదలవ్వనుండగా.. ట్రోఫీ జనవరి 7 వరకూ జరగనుంది. టీమిండియా చేతిలో మూడుసార్లు ఓడిన ఆసీస్ ఈసారి బీజీటీ ట్రోఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.