నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీ అంతర్జాతీయ వేదికపై మరోమారు అదరగొట్టింది. పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసులో దీప్తి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. పారాలింపిక్స్‌లో పోటీకి దిగింది తొలిసారే అయినా..ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన దీప్తి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఏడో లేన్‌లో పరుగు మొదలుపెట్టిన ఈ వరంగల్ అమ్మాయి..మూడో స్థానంతో రేసును ముగించింది. విశ్వక్రీడా వేదికపై జాతీయ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. అయితే దీప్తి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో శ్రమ, కృషి దాగుంది.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో సామాన్య రైతు కూలీ కుటుంబంలో పుట్టిన దీప్తి..అథ్లెటిక్స్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పాలి. చిన్నతనంలో తలకు బలమైన గాయం ఆమె విధిరాతని మార్చింది. పొలం గట్లపై జింకను తలపిస్తూ దీప్తి పరిగెత్తే తీరు అందరినీ ఆశ్చర్యపరిచేది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలు ఆమె కెరీర్‌కు ప్రాణం పోశాయి. ప్రత్యర్థులను అవలీలగా దాటేస్తూ లక్ష్యాన్ని చేరుకున్న వైనాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు..ఈ విషయాన్ని ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్ దృష్టికి తీసుకొచ్చారు.
ఉన్నఫళంగా కల్లెడ నుంచి హైదరాబాద్‌కు మారిన దీప్తి కెరీర్‌కు రమేశ్ మెరుగులు అద్దారు. తన పరుగుకు ప్రతిభను జోడిస్తూ ఒక్కో మెట్టు ఎదిగిన దీప్తి..తొలుత సాధారణ అథ్లెట్లతో కలిసి పోటీపడింది. అయితే దీప్తికి ఉన్న మేధోపరమైన సమస్యను గుర్తించిన రమేశ్..పారాఅథ్లెటిక్స్ వైపు ఆమెను అడుగులు వేయించారు. 2019 ఏషియన్ యూత్ చాంపియన్‌షిప్‌లో ప్రాతినిధ్యం ద్వారా పారా అథ్లెట్‌గా కెరీర్ మొదలుపెట్టింది.
అప్పటి నుంచి ఆమె మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. 2022 ఆసియా పారా గేమ్స్‌లో రికార్డు స్వర్ణం సొంతం చేసుకుంది. అదే జోరు కొనసాగిస్తూ ఈ ఏడాది జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 55.07 టైమింగ్‌తో కొత్త రికార్డు నెలకొల్పింది. పారాలింపిక్స్‌లో కాంస్యంతో దీప్తి పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతున్నది.
2024-09-03T21:19:32Z dg43tfdfdgfd