Deepthi Jeevanji | పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన తెలంగాణకు చెందిన అమ్మాయి దీప్తి జీవాంజికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అభినందనలు తెలిపారు. పారా ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మహిళల 400 మీటర్ల T20లో ఫైనల్‌లో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ రికార్డుతో కాంస్య పతకాన్ని సాధించింది. తెలంగాణకు తొలిసారిగా ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించి పెట్టింది. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. దీప్తి కాంస్య పతకం గెలువడంపై కేటీఆర్ అభినందనలు తెలిపారు. అసమాన ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచావని.. ఆడపిల్లలు తమ అసమానమైన శక్తి సామర్థ్యాలతో ఎంతటి ఆనందాన్ని తల్లితండ్రులకు ఇస్తారో ఆడ పిల్ల తండ్రిగా నాకు తెలుసునని.. ఎన్ని కష్టాలున్న సరే దీప్తి తల్లితండ్రులు మాత్రం తన మీద నమ్మకం ఉంచటం గొప్ప విషయమన్నారు. ఆ తల్లితండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ దీప్తి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవటం సంతోషంగా ఉందన్నారు.