Deepthi Jeevanji | ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో భారత యువ అథ్లెట్ జివాంజీ దీప్తి తళుక్కున మెరిసింది. మహిళల 400మీటర్ల టీ20 రేసులో కాంస్య పతకంతో సత్తాచాటింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసులో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ తెలంగాణ అమ్మాయి అరంగేట్రం పారాలింపిక్స్‌లో తొలి పతకాన్ని ముద్దాడి ఔరా అనిపించింది. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పరుగులో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. కచ్చితంగా పతకం గెలుస్తుందన్న అంచనాలను నిజం చేస్తూ పోటీకి దిగిన ఈ వరంగల్ ముద్దుబిడ్డ భారత ఖ్యాతిని ఇనుమడింపజేసింది.
ప్రపంచ రికార్డు పారా అథ్లెట్‌గా పారాలింపిక్స్‌లో బరిలోకి దిగిన దీప్తి మూడో స్థానంతో పోటీని ముగించింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు కొల్లగొట్టిన దీప్తి..భారత భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నది. రెండు పదుల వయసులోనే కోట్లాది మంది ఆశలకు ప్రతిరూపంగా నిలిచింది. సామాన్య వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన దీప్తి కష్టాలకు ఎదురొడ్డుతూ, అవమానాలు భరిస్తూ ఈ స్థాయికి చేరిన వైనం ఎంతో మందికి ప్రేరణ. బ్యాడ్మింటన్‌లో పతక జోరు కొనసాగిస్తూ నిత్యశ్రీ కాంస్యాన్ని తాలో వేసుకుంది.
పారిస్: పారాలింపిక్స్‌లో తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీ కంచు మోత మోగించింది. మహిళల 400 మీటర్ల పరుగు పందెం(టీ20)లో దీప్తి.. 55.82 సెకన్లలో పరుగును పూర్తిచేసి మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యంతో సత్తా చాటింది. అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం నెగ్గిన ఉక్రెయిన్ అథ్లెట్ షులియర్ యులియ (55.16), రజతం గెలిచిన టర్కీ అమ్మాయి ఒండర్ ఐసెల్ (55.23)కు దీప్తి మధ్య తేడా మిల్లీ సెకన్లే.
సోమవారం జరిగిన హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన దీప్తి.. తుది పోరులో తృటిలో బంగారు పతకాన్ని చేజార్చుకున్నా పోడియంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. రేసు మధ్య వరకూ రెండో స్థానంలో ఉన్న దీప్తి లక్ష్యానికి కొద్దిదూరంలో ఉండగా నెమ్మదించడాన్ని టర్కీ అమ్మాయి సద్వినియోగం చేసుకుంది. ఇక బ్యాడ్మింటన్‌లో మరో షట్లర్ సుమతి శివన్ నిత్య శ్రీ (ఎస్‌హెచ్6) కాంస్య పోరులో గెలిచి భారత్‌కు మరో పతకాన్ని అందించింది.
పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల ఖాతా తెరిచిన యువ షూటర్ అవని లేఖరా మరో పతకాన్ని దక్కించుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. మంగళవారం ముగిసిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్‌హెచ్1లో ఆమె ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 1159 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్స్‌కు అర్హత సాధించి అవని.. కీలక పోరులో మాత్రం తడబడింది. ఫైనల్స్‌లో ఆమె 420.6 పాయింట్లు సాధించింది. 456.5 పాయింట్లతో జర్మనీ షూటర్ హిల్‌ట్రాప్ నటాస్చా స్వర్ణం గెలుచుకోగా వెరోనికా (స్లోవేకియా), జంగ్ (చైనా) రజత, కాంస్యాలు నెగ్గారు.
పారా బ్యాడ్మింటన్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. సోమవారం ఓ స్వర్ణం, రెండు రజతాలు, మరో కాంస్యంతో దుమ్మరేపిన పారా షట్లర్లు దుమ్మురేపగా సుమతి సైతం అదే బాటలో నడిచింది. మహిళల సింగిల్స్ ఎస్‌హెచ్6 కాంస్య పోరులో సుమతి.. 21-14, 21-6తో మార్లినా రినా (ఇండోనేషియా)ను చిత్తు చేసి ఈ క్రీడలో భారత్‌కు మరో పతకాన్ని చేర్చింది. ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సుమతికి ప్రత్యర్థి నుంచి మొదటి గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైనా రెండో గేమ్‌లో మాత్రం ఆమె రెచ్చిపోయింది.
13 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను ముగించిన సుమతి.. రెండో గేమ్‌ను 10 నిమిషాల్లోనే పూర్తిచేసి కాంస్యాన్ని ముద్దాడింది. హోసూర్‌కు చెందిన 19 ఏండ్ల నిత్య.. 2016 దాకా క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నా ఆ ఏడాదిలో జరిగిన పారాలింపిక్స్ తర్వాత తన దృష్టిని బ్యాడ్మింటన్‌పై నిలిపింది.
2024-09-03T21:34:34Z dg43tfdfdgfd