CRICKET WORLD CUP | మూడోసారి ప్రపంచకప్‌ నెగ్గాలన్న భారత్‌ ఆశలపై ఆసీస్‌ నీళ్లు.. ఫైనల్లో ఓడిన టీమ్‌ఇండియా

  • ఆసీస్‌ సిక్సర్‌.. ఆరోసారి ప్రపంచకప్‌ కైవసం
  • భారత్‌ 240; ఆస్ట్రేలియా 241/4
  • హెడ్‌ భారీ సెంచరీ

భారత్‌కు భంగపాటు! ముచ్చటగా మూడోసారి విశ్వ విజేతగా నిలువాలనుకున్న టీమ్‌ఇండియాకు నిరాశ తప్పలేదు. పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో అదరగొట్టే ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన రోహిత్‌ సేన తుదిపోరులో ఆసీస్‌ చేతిలో కంగుతింది.

వరల్డ్‌కప్‌ ఆసాంతం దంచికొట్టిన బ్యాటర్లు.. విషమ పరీక్షలో ఎదురు నిలువకపోవడంతో మొదట భారత్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. ఛేదన ఆరంభంలో కంగారూలు కాస్త తడబడ్డా ఆ తర్వాత మెరుగైన ప్రదర్శనతో ఆరోసారి విశ్వవిజేతలుగా నిలిచారు!

మ్యాచ్‌కు ముందు లక్ష ముప్పై వేల మంది అభిమానులను నిశబ్దంగా ఉంచడం కంటే పెద్ద సంతృప్తి ఏముంటుందన్న ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌.. మైదానంలో అక్షరాల దాన్ని ఆచరించి చూపాడు.

Cricket World Cup | అహ్మదాబాద్‌: ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్‌కప్‌ మొత్తం నిలకడగా రాణించిన టీమ్‌ఇండియా చివరి మెట్టుపై తడబడింది. వరుసగా పది మ్యాచ్‌లు నెగ్గి ఫైనల్‌ చేరిన రోహిత్‌ సేన.. ఆఖరి పోరులో పరాజయం వైపు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచి ఆరోసారి ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (107 బంతుల్లో 66; ఒక ఫోర్‌), విరాట్‌ కోహ్లీ (63 బంతుల్లో 54; 4 ఫోర్లు) అర్ధశతకాలు సాధించగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (31 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎప్పట్లాగే జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (4), శ్రేయస్‌ అయ్యర్‌ (4), రవీంద్ర జడేజా (22 బంతుల్లో 9) విఫలమయ్యారు. జట్టుకు అత్యవసరమైన సందర్భంలో కీలకంగా మారగలడని ఆశించిన సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 18; ఒక ఫోర్‌) సిక్సర్లతో విజృంభిస్తాడనుకుంటే.. అసలు బౌండ్రీ కొట్టేందుకే నానా తంటాలు పడ్డాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ 3, హజిల్‌వుడ్‌, కమిన్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడటంలో ఆరితేరిన ఆస్ట్రేలియా అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. మైదానంలో చిరుతలను తలపించిన కంగారూలు.. స్టేడియంలో ఉన్నది 11 మందా లేక 22 మందా అన్నట్లు బంతి ఎటు వైపు వెళ్తే అక్కడ దర్శనమిచ్చారు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ ఆలౌట్‌ కావడం ఇదే తొలిసారి. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (120 బంతుల్లో 137; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్‌ సెంచరీతో చెలరేగితే.. మార్నస్‌ లబుషేన్‌ (110 బంతుల్లో 58 నాటౌట్‌; 4 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. డేవిడ్‌ వార్నర్‌ (7), మిషెల్‌ మార్ష్‌ (15), స్టీవ్‌ స్మిత్‌ (4), విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 2, షమీ, సిరాజ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. హెడ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, కోహ్లీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

అందుకే అది ఆస్ట్రేలియా!

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో పోరులోనూ పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‌ ప్రసారమవుతున్న సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న పాకిస్థాన్‌ పేస్‌ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ ఓ మాట అన్నాడు. ‘ఒకవేళ ఈ మ్యాచ్‌లో కంగారూలు ఓడితే.. ఆ తర్వాత ప్రత్యర్థి ఎవరనే దానితో సంబంధం లేకుండా ఆసీస్‌ నిర్దయగా విరుచుకుపడుతుంది. ఇక దాన్ని ఆపడం ఎవరి తరం కాదు’ అని అక్రమ్‌ అన్న మాటలను ఆసీస్‌ నిజం చేసింది. అక్కడి నుంచి ప్రతి మ్యాచ్‌లో అంతకంతకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగిన ఆసీస్‌.. వరుసగా ఏడు మ్యాచ్‌లు నెగ్గి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. అఫ్గానిస్థాన్‌తో పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన కాబూలీలు ఆసీస్‌ ముందు 292 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

రషీద్‌, ముజీబ్‌, నబీ, నూర్‌ రూపంలో నలుగురు ప్రమాదకర స్పిన్నర్స్‌ ఉండటంతో ఆసీస్‌కు కష్టమే అని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఆ జట్టు 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ప్రపంచంలో మరే జైట్టెనా ఇంకో 20-30 రన్స్‌కు ఆలౌట్‌ అయి ఉండేది. కానీ, అక్కడ ఉన్నది ఆస్ట్రేలియా కదా.. అద్వితీయ పోరాటం కనబర్చింది. అప్పుడప్పుడు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం తప్ప.. నిలకడగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడనే నమ్మకం లేని మ్యాక్స్‌వెల్‌ మొత్తం సీన్‌ రివర్స్‌ చేశాడు. ఒంటరి పోరాటం అంటే ఏంటో చేతల్లో చూపాడు. అఫ్గాన్‌ బౌలర్లపై శివతాండవమాడాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులు చేసి అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లోనూ ఆస్ట్రేలియాకు దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. లీగ్‌ దశలో కంగారూలపై సునాయాసంగా గెలిచిన సఫారీలు.. నాకౌట్‌ పోరులో 212 పరుగులకే ఆలౌటయ్యారు.

ఆసీస్‌ ఉన్న ఊపులో ఇదేమంత కష్టతర ఛేదన కాదనిపించింది. కానీ ప్రోటీస్‌ బౌలర్లు పట్టు వదలకపోవడంతో ఒక దశలో ఆసీస్‌ తుదిపోరుకు చేరడం కష్టమే అని అంతా భావించారు. అయితే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఉగ్గుపాలతోనే నేర్చుకున్న కంగారూలు ఏమాత్రం తడబడకుండా విజయ తీరాలకు చేరారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌ పోరాట పటిమ చూసిన ఎవరికైనా.. ఒకప్పటి ఆస్ట్రేలియా టీమ్‌ స్పిరిట్‌ గుర్తు రాక మానదు. ఏ మాత్రం బెదురు లేకుండా బరిలోకి దిగిన ఆసీస్‌.. తొణకక బెణకక పని పూర్తి చేసింది. గత మ్యాచ్‌లో కోహ్లీ క్యాచ్‌ మిస్‌ చేయడంతోనే మ్యాచ్‌ను దూరం చేసుకున్నామని ఆట ఆరంభానికి ముందే చెప్పిన ఆసీస్‌.. అలాంటి పొరపాటు ఫైనల్లో చేయలేదు.

పవర్‌ప్లేలో కంగారూల బౌలింగ్‌ను కకావికలం చేసిన రోహిత్‌ శర్మ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ హెడ్‌ అందుకున్న తీరు వారి కసికి నిదర్శనం. తుదిపోరులో టీమ్‌ఇండియాను ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించేలా చేసిన కంగారూ ఫీల్డింగ్‌.. ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాగా నిలిచింది. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగిన వాడే అసలైన విజేత అని ఆసీస్‌ మరోసారి నిరూపించింది. రోహిత్‌సేన మొత్తం ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లకు పరిమితమైతే.. ట్రావిస్‌ హెడ్‌ ఒక్కడే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో వార్‌ వన్‌సైడ్‌ చేశాడు. ఫలితంగా భారత అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఇక్కడితో లోకం అగిపోయేదేం కాదు.. ఆట ముగిసిపోయేదేం కాదు.. కానీ, స్వదేశంలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్‌ సేన పరాజయాన్ని జీర్ణించుకోవడం అంత తేలిక కూడా కాదు! -నమస్తే తెలంగాణ క్రీడావిభాగం

1ఈ టోర్నీలో అత్యధిక (31) సిక్సర్లు కొట్టిన ఘనత రోహిత్‌దే.

1 ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రోహిత్‌ (597) అగ్రస్థానంలో నిలిచాడు. గత వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌

విలియమ్సన్‌ (578) చేసిన స్కోరును హిట్‌మ్యాన్‌ అధిగమించాడు.

3 ప్రపంచ కప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన మూడో భారత ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు. అంతకుముందు 2003లో సచిన్‌ టెండూల్కర్‌, 2011 యువరాజ్‌ సింగ్‌ ఈ పురస్కారం దక్కించుకున్నారు.

ప్రైజ్‌ మనీ

ఆసీస్‌: రూ . 33 కోట్లు

భారత్‌ : రూ . 16 కోట్లు

పరుగుల ధీరుడు

కోహ్లీ 765

వికెట్ల వీరుడు

షమీ 24

సంక్షిప్త స్కోర్లు

భారత్‌: 50 ఓవర్లలో 240 ఆలౌట్‌ (రాహుల్‌ 66, కోహ్లీ 54; స్టార్క్‌ 3/55, కమిన్స్‌ 2/34),

ఆస్ట్రేలియా: 43 ఓవర్లలో 241/4 (హెడ్‌ 137, లబుషేన్‌ 58 నాటౌట్‌; బుమ్రా 2/43).

2023-11-19T22:31:55Z dg43tfdfdgfd