CA Gold Medalist Died : సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో బుధవారం (జూన్ 4) బెంగళూరులో పండగ వాతావరణం నెలకొంది. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వెలుపల వేలాది మంది జనసందోహం, అభిమానుల ఆనందోత్సవాలు, నినాదాలతో కోలాహలంగా కనిపించింది. క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఇది కల నిజమైన రోజు.
ఈ ఉత్సాహంలోనే అక్షత, ఆశయ్ అనే దంపతులు స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరై తమ అభిమాన క్రికెటర్లను చూద్దామని ఆశించారు. అయితే వారి ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. స్టేడియం లోపలికి వెళ్తున్న క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అక్షత ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్టేడియం వద్ద ఏం జరిగిందో ఆశయ్ వివరించారు. "17వ నంబర్ గేటు నుంచి అక్షత, నేను స్టేడియంలోకి వెళ్తున్నాము. అక్కడ భారీగా జనాలు ఉన్నారు. ఈ క్రమంలో చేయి పట్టు తప్పి నేను కింద పడ్డాను. కొందరు వ్యక్తులు నన్ను పైకి లేపారు. అయితే అక్కడ అక్షత కనిపించలేదు. ఆమెను వెతుక్కుంటూ అటూ ఇటూ తిరిగాను. పోలీసులను అడిగాను. ఇంతలో ఓ యువకుడు ఆర్సీబీ జెర్సీ ధరించిన ఓ మహిళను ఎత్తుకొని తీసుకువెళ్తున్న వీడియో చూపించాడు. దీంతో నేను పలు ఆస్పత్రులు వెతికాను. చివరికి బౌరింగ్ ఆస్పత్రిలో ఆమెను విగత జీవిగా చూశాను" అంటూ ఆశయ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.