దిగ్గజాల నిష్క్రమణ వేళ కొత్త నాయకుడి సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు.. తొలి టెస్టులో ఓడినప్పటికీ రెండో టెస్టులో గెలుపు ముంగిట నిలిచింది. ఇప్పటిదాకా ఎడ్జ్‌బాస్టన్‌లో గెలుపు రుచి చూడని (టెస్టుల్లో) టీమ్‌ఇండియాకు రెండో టెస్టులో ఆ కలను సాకారం చేసుకునేందుకు సువర్ణావకాశం దక్కింది. ప్రత్యర్థి ఎదుట 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చింది. ఆట ఐదోరోజు భారత బౌలర్లు.. ఏడు వికెట్లు పడగొడితే బర్మింగ్‌హామ్‌లో రికార్డు విజయం గిల్ సేన సొంతమవనుంది!
బర్మింగ్‌హామ్: ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు టీమ్‌ఇండియా ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. ఇప్పటిదాకా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలవని భారత జట్టు.. చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమైంది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో 72/3గా నిలిచింది. అంతకుముందు సారథి శుభ్‌మన్ గిల్ (162 బంతుల్లో 161, 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ రికార్డు సెంచరీతో కదం తొక్కగా.. రవీంద్ర జడేజా (118 బంతుల్లో 69 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (58 బంతుల్లో 65, 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ 427/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో ప్రత్యర్థి ఎదుట 607 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ కుదేలైంది. ఆకాశ్ దీప్ (2/36), మహ్మద్ సిరాజ్ (1/29) వికెట్ల వేట మొదలుపెట్టారు. చివరి రోజు ఆతిథ్య జట్టు విజయానికి 536 పరుగులు అవసరం కాగా భారత్ గెలుపునకు 7 వికెట్లు కావాల్సి ఉంది. మరి భారత బౌలర్లు ఏం చేసేనో!
ఓవర్ నైట్ స్కోరు 64/1తో నాలుగో రోజు తొలి సెషన్ ఆటను ఆరంభించిన భారత్.. మొదట్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మేఘావృతమై ఉన్న వాతావరణాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ బౌలర్లు తొలి గంటలోనే కరుణ్ నాయర్ (26), కేఎల్ రాహుల్ (55) వికెట్లు పడగొట్టారు. ఈ ఇద్దరూ దూకుడుగానే ఆడినా కార్స్ వేసిన 21వ ఓవర్లో కరుణ్.. వికెట్ కీపర్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి మరోసారి నిరాశపరిచాడు. డ్రింక్స్ విరామం అనంతరం రాహుల్‌ను అద్భుతమైన డెలివరీతో టంగ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. వీరి స్థానాల్లో వచ్చిన కెప్టెన్, వైస్ కెప్టెన్ జోడీ దూకుడును కొనసాగించింది. ముఖ్యంగా పంత్.. వన్డే తరహా ఆట ఆడాడు. క్రీజులోకి వచ్చీరాగానే 4,6తో బ్యాట్‌కు పనిచెప్పిన పంత్.. తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. టంగ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు కొట్టాడు. ఈ ద్వయం ధాటిగా ఆడటంతో తొలి సెషన్‌లో భారత్ 25 ఓవర్లలోనే 4.52 రన్‌రేట్‌తో 113 పరుగులు చేసింది. లంచ్ విరామానికే గిల్ సేన ఆధిక్యం 350 రన్స్ దాటింది.
లంచ్ తర్వాత భారత స్కోరుబోర్డు మరింత వేగం పుంజుకుంది. బషీర్ తొలి బంతినే పంత్ బౌండరీగా మలిచిన పంత్ ఇక్కడ్నుంచి ఆట ఎలా ఉండనుందో చెప్పకనే చెప్పాడు. టంగ్ వేసిన మరుసటి ఓవర్లో గిల్.. 6, 4, 4తో రెచ్చిపోయాడు. అతడే వేసిన తర్వాతి ఓవర్లో బౌండరీతో కెప్టెన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. పంత్ కూడా ఫిఫ్టీ తర్వాత సిక్స్ కొట్టడంతో టీమ్‌ఇండియా ఆధిక్యం 400కు చేరింది. బషీర్ 47వ ఓవర్లో రెండో బంతిని లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడిన పంత్.. అక్కడే ఉన్న డకెట్ చేతికి చిక్కడంతో 103 బంతుల్లో 110 పరుగులు జోడించిన నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. పంత్ నిష్క్రమణ తర్వాత స్కోరు వేగం కాస్త నెమ్మదించింది.
రూట్ బౌలింగ్‌లో బౌండరీతో శతకానికి చేరువైన గిల్.. టీ విరామానికి ముందు శతకాన్ని బషీర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి టెస్టులలో 8వ, ఇంగ్లండ్‌పై ఐదో శతకాన్ని నమోదుచేశాడు. వోక్స్ బౌలింగ్లో 6,4,4 తో గిల్ రెచ్చిపోగా క్రీజులో కుదురుకున్నాక జడ్డూ సైతం బౌండరీలతో విరుచుకుపడి వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టీ సాధించాడు. రూట్ బౌలింగ్‌లో గిల్ రెండు సిక్సర్లు బాదడంతో భారత ఆధిక్యం 550 దాటింది. బషీర్ బౌలింగ్‌లో గిల్.. అతడికే క్యాచ్ ఇచ్చి ఔటవ్వగా నితీశ్‌కుమార్ (1) మరోసారి విఫలమయ్యాడు. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్‌ను 427/6 వద్ద డిక్లేర్డ్ చేసింది.
హైదరాబాదీ పేసర్ సిరాజ్.. క్రాలీ (0)ని ఔట్ చేసి భారత్‌కు బ్రేకిచ్చాడు. డకెట్ (25) ను ఆకాశ్.. ఐదో ఓవర్లో మూడో బంతికి బౌల్డ్ చేశాడు. అదే ఊపులో ఆకాశ్.. రూట్ (6)నూ క్లీన్‌బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టుకు డబుల్ షాకులిచ్చాడు. బ్రూక్ (15*), పోప్ (24*) మరో వికెట్ పడకుండా చూసుకున్నారు.
టెస్టులలో ఇప్పటిదాకా అత్యధిక ఛేదన 418/7. 2003లో ఆసీస్ నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని విండీస్ విజయవంతంగా ఛేదించింది.
1కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన భారత సారథుల్లో గిల్.. కోహ్లీ (449)ని అధిగమించాడు.
2 ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో 150+ స్కోరు చేసిన బ్యాటర్లలో అలెన్ బోర్డర్ తర్వాత గిల్ రెండో ఆటగాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 587 ; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407 ; భారత్ రెండో ఇన్నింగ్స్: 83 ఓవర్లలో 427/6 డిక్లేర్డ్ (గిల్ 161, జడేజా 69*, టంగ్ 2/93, బషీర్ 2/119) ; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 16 ఓవర్లలో 72/3 (డకెట్ 25, పోప్ 24*, ఆకాశ్ 2/36, సిరాజ్ 1/29)
2025-07-05T20:10:46Z