సూర్య గోల్డెన్ ఛాన్స్‌కు గిల్ అడ్డు తగులుతున్నాడా..?

వెన్ను గాయం కారణంగా న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్.. గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు శ్రేయస్ దూరమయ్యాడు. అయ్యర్ స్థానంలో మిడిలార్డర్‌లో ఆడించడం కోసం శుభ్‌మన్ గిల్‌, సూర్యకుమార్ యాదవ్‌ పేర్లను బీసీసీఐ పరిశీలిస్తోంది. అయ్యర్ స్థానంలో సూర్య బరిలోకి దిగడం ఖాయమని భావించగా.. గిల్ పట్ల మేనేజ్‌మెంట్ ఆసక్తితో ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే టెస్టు క్రికెట్ ఆడుతుండటంతోపాటు.. ఇండియా-ఏ తరఫున లాంగ్ ఫార్మాట్లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగి డబుల్ సెంచరీ చేసిన అనుభవం ఉండటం గిల్‌కు కలిసి రానుంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకూ టెస్టు క్రికెట్ ఆడలేదు. కానీ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం అతడి బలం. నాథన్ లియాన్‌పై సూర్య ఎదురు దాడి చేయగలడని బీసీసీఐ నమ్మకంతో ఉంది.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫస్ట్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. మూడో స్థానంలో పుజారా, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు వస్తారు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే వ్యక్తి రెండో కొత్త బంతిని ఎదుర్కోవాల్సి ఉండటంతో.. ఆ పొజిషన్ చాలా ముఖ్యమైంది.

‘ఇండియా-ఏ తరఫున వెస్టిండ్-ఏ టూర్‌కు వెళ్లిన గిల్.. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసి, ఓ టెస్టులో డబుల్ సెంచరీ చేశాడు. తర్వాత ఓపెనర్‌గా మారాడు’ అని మాజీ సెలక్టర్ ఒకరు గుర్తు చేశారు. ‘సూర్య విషయానికి వస్తే.. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ల మీద స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించే అతడి నైజం ముఖ్యం కానుంది. నాథన్ లియాన్ ఆఫ్ బ్రేక్ వేస్తే.. సూర్య తన ఫుట్ వర్క్‌తో అతణ్ని పడగొట్టగలడు. కానీ కమిన్స్, హేజిల్‌వుడ్ లాంటి పేసర్ల బౌలింగ్‌లో గిల్ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. న్యూజిలాండ్‌తో మూడో టీ20 ముగిసిన తర్వాత భారత జట్టు ముంబైలో సన్నద్ధతను మొదలుపెట్టనుంది.

2023-02-01T11:12:16Z dg43tfdfdgfd