హనుమ విహారి: ఎడమ చేయి విరిగిందని కుడి చేతితో బ్యాటింగ్... ఒంటి చేతితోనే రెండు ఫోర్లు

ఇండియన్ క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టు ప్రస్తుత కెప్టెన్ హనుమ విహారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

మ్యాచ్‌లో గాయపడిన ఆయన చేతివాటం మార్చుకుని బ్యాటింగ్‌కు రావడంతో సోషల్ మీడియా వేదికగా మాజీ క్రికెటర్లు, సహ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు హనుమ విహారిని మెచ్చుకుంటున్నారు.

మధ్యప్రదేశ్ జట్టుతో ఇండోర్‌లో జరిగిన రంజీ క్వార్టర్స్‌లో తొలి రోజు ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్ విసిరిన బౌన్సర్ బలంగా తగలడంతో హనుమ విహారి ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది.

అప్పటికి 16 పరుగులు చేసిన ఆయన రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి రోజు ఆటలో రెండు వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసిన ఆంధ్ర జట్టు రెండో రోజు వరుసగా వికెట్లు కోల్పోయింది. రెండు వికెట్ల నష్టానికి 323 పరుగులతో పటిష్టంగా కనిపించిన జట్టు అనంతరం వరుసగా బ్యాటర్లు అవుటవడంతో 353 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.

దీంతో జట్టుకు మరిన్ని పరుగులు అందివ్వాలన్న తాపత్రయంతో హనుమ విహారి 11వ స్థానంలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు.

అయితే, కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన హనుమ విహారి ఎడమ చేతి మణికట్టుకు గాయం కావడంతో చేతివాటం మార్చుకుని, ఎడమ చేతివాటంతో ఒంటిచేతితో(కుడిచేతితో) బ్యాటింగ్ చేశాడు.

కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తే బ్యాటర్ ఎడమచేయి బంతికి ఎదురుగా ఉంటుంది.. కాబట్టి దెబ్బ తగిలిన ఎడమచేయి బంతిని ఎదురుగా ఉండకుండా ఆయన ఎడమ చేతివాటానికి మారారు. అప్పుడు కుడిచేయి బౌలర్‌కు ఎదురుగా ఉంటుంది.

అలా 20 బంతులు ఎదుర్కొన్న ఆయన ఒంటి చేత్తోనే రెండు బౌండరీలూ బాదాడు. ముందు రోజు స్కోరుకు 11 పరుగులు జోడించిన తరువాత అవుట్ అయ్యాడు.

దీంతో ఆంధ్ర జట్టు 379 పరుగులకు ఆల్‌అవుట్ అయింది.

ఈ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో రికీ భుయ్, కరణ్‌ శిందేలు సెంచరీలు సాధించినప్పటికీ హనుమ విహారియే అందరి దృష్టినీ ఆకర్షించాడు.

జట్టు కోసం గాయాన్ని కూడా వెరకవ చేతివాటం మార్చుకుని బ్యాటింగ్ చేయడంతో విహారిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరోవైపు హనుమ విహారి గాయపడడానికి ముందు 37 బంతుల్లో 16 పరుగులు చేయగా రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చిన తరువాత 20 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేశాడు.

అయితే, గాయపడిన విహారికి మరింత ఇబ్బంది కలగకుండా అప్పటికి క్రీజులో ఉన్న మరో బ్యాటర్ లలిత్ మోహన్ వీలైనంత వరకు స్ట్రైక్ తనకే ఉండేలా చూసుకున్నాడు.

అలా ఇద్దరూ దాదాపు 10 ఓవర్లు బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును 379కి చేర్చారు.

ఒంటి చేతితోనే రెండు ఫోర్లు

అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గాయపడిన విహారి రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు అదే అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఒంటి చేత్తోనే రెండు ఫోర్లు కొట్టాడు.

మధ్యప్రదేశ్‌కు చెందిన రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన అవేశ్ ఖాన్‌కు కూడా టీమ్‌ఇండియాకు ఆడిన అనుభవం ఉంది.

2022లో ఆయన టీమ్‌ఇండియా తరఫున వన్డేలు, టీ20లు ఆడారు.

గాయం తీవ్రమైనదే..

ఈ మ్యాచ్‌లో గాయపడిన విహారి ఎడమ చేతి మణికట్టులో చీలిక ఏర్పడినట్లు ఎక్స్‌రేలో తేలింది.

దీంతో 5 నుంచి 6 వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

2021లో ఆస్ట్రేలియాతో టెస్టులోనూ..

విహారి తాజా పోరాట పటిమను చూసినవారు 2021లో గవాస్కర్ బోర్డర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆయన ఆట తీరును గుర్తుచేసుకుంటున్నారు.

ఆ మ్యాచ్‌లో 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 272 పరుగులకే భారత జట్టు 5 వికెట్లు కోల్పోయింది. అప్పటికి క్రీజులో ఉన్న విహారికి అశ్విన్ తోడవడంతో ఇద్దరూ కలిసి మ్యాచ్ భారత్ చేజారకుండా డ్రా అయ్యేలా చేశారు.

ఆ మ్యాచ్‌లోనూ విహారి కాలికి గాయంతో ఆడాడు. విహారి, అశ్విన్‌లో 42.3 ఓవర్ల పాటు వికెట్ ఇవ్వకుండా ఆడి మ్యాచ్‌ను డ్రా చేశారు. ఈ క్రమంలో విహారి 161 బంతులు ఆడి 23 పరుగులు చేయగా అశ్విన్ 128 బంతుల్లో 39 పరుగులు చేశాడు.

తాజా రంజీ మ్యాచ్‌లో హనుమ విహారి ఆటపై అశ్విన్ స్పందించాడు. విహారి అసలైన పోరాట యోధుడు అంటూ ఆయన 2021 నాటి ఆస్ట్రేలియా మ్యాచ్‌లో తమ ఇద్దరి ఫొటోను జోడించారు.

https://twitter.com/ashwinravi99/status/1620727165041143808

మరో క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా హనుమ విహారి పోరాట పటిమను ప్రశంసించారు.

https://twitter.com/DineshKarthik/status/1620675076806053889

టీమ్‌ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ హనుమ విహారి ధైర్యం మామూలుగా లేదన్నారు.

https://twitter.com/venkateshprasad/status/1620755936519536640

క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్, కామెంటరేటర్ హర్ష భోగ్లే, సినీ నటుడు సాయిధరమ్ తేజ తదితరులూ హనుమ విహారిని మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు.

‘అన్నా! నువ్వే మాకు స్ఫూర్తి’

చేతికి గాయం తరువాత కూడా వచ్చి ఆడడం, ఒంటిచేతితో ఆడడం చిన్న విషయం కాదు.. నువ్వు మాకు స్ఫూర్తిగా నిలిచావు అన్నా అంటూ వెంకటేశ్ అయ్యర్ ట్వీట్ చేశాడు.

https://twitter.com/venkateshiyer/status/1620715758417477633

హనుమ విహారి ఎంత దృఢమైన ఆటగాడో తెలియడానికి ఇది మరో ఉదాహరణ.

2021లో ఆస్ట్రేలియాతో సిరీస్‌ను ఎలా నిలబెట్టాడో గుర్తుచేస్తోంది ఇది అంటూ కామెంటరేటర్ హర్షభోగ్లే ట్వీట్ చేశారు.

https://twitter.com/bhogleharsha/status/1620736025013387271

అసలైన ‘హనుమ’ విహారి అంటూ నటుడు సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఆటలో మరింత ఎత్తుకు ఎదగాలంటూ ఆకాంక్షించారు.

https://twitter.com/IamSaiDharamTej/status/1620788568020111360

కాగా జట్టు కోసమే గాయాన్ని వెరవక ఆడానని, టీమ్ స్కోరుకు మరికొన్ని పరుగులు జోడించాలన్నదే తన లక్ష్యమని, ఈ సందర్భంగా తనను అభినందించిన అందరికీ ధన్యవాదాలు అంటూ హనుమ విహారి ట్వీట్ చేశారు.

https://twitter.com/Hanumavihari/status/1620782137476800512

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-02-02T03:28:29Z dg43tfdfdgfd