నా కోసం ఫ్యామిలీ ఎన్నో త్యాగాలు చేసింది : త్రిష
తనను మంచి క్రికెటర్‌గా చూసేందుకు తండ్రి, ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో త్యాగాలు చేశారని ఐసీసీ విమెన్స్ అండర్19 టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన ఇండియా టీమ్ ప్లేయర్, తెలంగాణ క్రికెటర్ గొంగడ త్రిష తెలిపింది. ఈ విజయంతో వాళ్ల కష్టానికి ఫలితం దక్కిందంటోంది. విమెన్స్ కేటగిరీలో ఇండియాకు తొలి కప్ అందించిన టీమ్‌లో భాగం అయినందుకు ఎంతో గర్వపడుతున్నానని, వరల్డ్ విన్నర్స్ అంటే గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తోందని తెలిపింది. వీలైనంత త్వరగా సీనియర్ టీమ్‌కు ఆడటమే తన టార్గెట్ అంటున్న త్రిష సౌతాఫ్రికా నుంచి ‘వెలుగు’తో మాట్లాడింది. టోర్నీ, తన కెరీర్, ఫ్యూచర్ గురించి త్రిష చెప్పిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే..
ఫస్ట్ ఐసీసీ వరల్డ్‌కప్ అయినా, మాపై అంచనాలున్నా.. ఎప్పుడూ ఒత్తిడికి గురవ్వలేదు. ఎందుకంటే మేం కప్పు గెలవాలనే వెళ్లాం. విజయంపై ఏ రోజూ అపనమ్మకంతో లేము. ఈ టోర్నీ కోసం మా కోర్ టీమ్‌ను చాలా ముందుగానే సెలెక్ట్ చేశారు. ప్లేయర్లమంతా ఇది వరకు కలిసి ఆడిన వాళ్లమే. షెఫాలీ వర్మ, రిచా ఘోష్ మాత్రమే కొత్తగా వచ్చారు. అయినా వాళ్లు వెంటనే టీమ్‌తో కలిసి పోయారు. టీమ్‌మేట్స్ అందరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. మ్యాచ్‌లు లేని టైమ్‌లో సఫారీ రైడ్స్, షాపింగ్ చేస్తూ ఆహ్లాదంగా గడిపాం. సౌతాఫ్రికాలో ప్రతీ రోజును, ప్రతీ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ ఆడాం. ఈ టోర్నీ కోసం నెల రోజుల ముందే సౌతాఫ్రికా రావడం మాకు హెల్ప్ అయ్యింది. ఇది వరకు మేం ఫారిన్‌లో ఆడింది లేదు. దాంతో, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు మాకు తగిన సమయం లభించింది.
ఈ టోర్నీలో నేను ఏడు మ్యాచ్‌లు ఆడినా మిడిలార్డర్‌లో రావడం వల్ల ఎక్కువగా బ్యాటింగ్ చేసే చాన్స్ రాలేదు. ఒకవేళ టాపార్డర్‌లో ఆడించి ఉంటే కచ్చితంగా సత్తాచాటి మరిన్ని రన్స్ చేసేదాన్ని. అయినా బ్యాటింగ్‌లో నా పెర్ఫామెన్స్ పట్ల సంతృప్తిగానే ఉన్నా. నేను లెగ్ స్పిన్ కూడా చేయగలను. కానీ, టీమ్‌లో చాలా మంది స్పిన్నర్లు ఉండటంతో మేనేజ్మెంట్ నాకు బౌలింగ్ చాన్స్ ఇవ్వలేదు.
అండర్19 వరల్డ్ కప్ నెగ్గడంతో ప్రస్తుతానికి నా కర్తవ్యం పూర్తయింది. విమెన్స్ ఐపీఎల్‌కు రిజిస్టర్ చేసుకున్నా. అవకాశం వస్తే ఆ లీగ్‌లో బాగా ఆడుతానన్న నమ్మకం ఉంది. ఈ వరల్డ్ కప్ ద్వారా ఎంతో కొంత పేరు, గుర్తింపు వస్తుందని తెలుసు. దాన్ని ప్రెజర్‌లా ఫీలవ్వను. వీలైనంత త్వరగా సీనియర్ టీమ్‌లోకి రావాలనుకుంటున్నా. నా గోల్ కూడా అదే. సీనియర్ విమెన్స్ టీ20 వరల్డ్‌కప్ అందుకునేందుకు కూడా కృషి చేస్తా.
నా కోసం మా నాన్న జీవీ రామిరెడ్డి, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా నాన్నను చూసే క్రికెట్లోకి వచ్చా. నాకు ఎనిమిదేండ్లప్పుడు మంచి కోచింగ్ కోసం భద్రాచలం నుంచి హైదరాబాద్ పంపించారు. కొంతకాలం తాతయ్య వాళ్ల దగ్గర ఉంచారు. కానీ, వాళ్లకు హెల్త్ ఇష్యూస్ రావడంతో అమ్మా, నాన్న భద్రాచలం నుంచి సిటీకి షిఫ్ట్ అయ్యారు. నా కోసం అక్కడ ఐటీసీలో జాబ్ వదిలేశారు. జిమ్, ల్యాండ్ అమ్మేశారు. ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా వాటి ప్రభావం నాపై పడకుండా చూసుకున్నారు. నాన్న మంచి స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలనుకున్నా సాధ్యం కాలేదు. నా ద్వారా తన కలను నెరవేర్చుకోవాలని చూశారు. నిత్యం నా వెన్నంటే ఉండి ఈ స్థాయికి తీసుకొచ్చారు. తన కలను ఇప్పుడు నేను నిజం చేశానని అనుకుంటున్నా. నా సక్సెస్, ఈ వరల్డ్ కప్ క్రెడిట్ మొత్తం నా ఫ్యామిలీదే.
ఇంగ్లండ్‌తో ఫైనల్‌ను మేం ప్రెజర్ ఫీలవ్వలేదు. దీన్ని మరో మ్యాచ్‌గానే తీసుకున్నాం. జట్టుగా బాగా ఆడాలని అనుకున్నామంతే. ఇంగ్లండ్ నుంచి టఫ్ ఫైట్ తప్పదని అనుకున్నాం. కానీ, మా బౌలర్లు అద్భుత పెర్ఫామెన్స్ చేయడంతో వన్‌సైడ్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో మేం చాలా బాగా ఫీల్డింగ్ చేశాం. సగం అవకాశాలే ఉన్న క్యాచ్‌లను పట్టుకోవడం, రనౌట్లు చేయడం టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇక, చిన్న టార్గెటే అయినా ఛేజింగ్‌లో వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోవడంతో నాలుగో నంబర్‌లో నేను బాధ్యత తీసుకున్నా. ముందు క్రీజులో కుదురుకున్నా. తర్వాత షాట్లు ఆడి మూడు బ్రౌండ్రీలు కొట్టి టీమ్‌ను విజయానికి చేరువ చేశా. అదే ఊపులో విన్నింగ్ షాట్ కొట్టాలని ట్రై చేసి బౌల్డ్ అయ్యా. ఆ బాల్‌కు స్ట్రెయిట్‌గా ఆడాల్సింది. కానీ లెగ్ సైడ్ బౌండ్రీ కోసం చూసి లైన్ మిస్సయ్యా. వరల్డ్‌కప్ విన్నింగ్ షాట్ కొట్టలేకపోవడం ఒక్కటే అసంతృప్తిగా ఉంది. ఏదేమైనా ఈ హిస్టారికల్ విక్టరీలో భాగం అయినందుకు నేను హ్యాపీనే.
©️ VIL Media Pvt Ltd. 2023-01-31T03:04:56Z dg43tfdfdgfd