సీఎం కప్‌ సందడి

  • నేటి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు
  • నగరానికి చేరుకున్న జిల్లా జట్లు
  • పోటీలకు వేదికలు సర్వం సిద్ధం
  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ సమీక్ష

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం ; రాష్ట్రంలో సీఎం కప్‌ క్రీడా టోర్నీ సందడి నెలకొంది. ఇప్పటికే మండల, జిల్లా స్థాయి పోటీలు అంచనాలకు మించి జరుగగా, రాష్ట్ర స్థాయి పోటీలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌ వేదికగా నేటి నుంచి క్రీడాటోర్నీలకు తెరలేవబోతున్నది. 18 క్రీడాంశాల్లో 33 జిల్లాలకు చెందిన యువతీయువకులు పోటీకి సై అంటున్నారు. నగరంలోని ఆరు స్టేడియాల్లో వివిధ క్రీడాంశాల్లో ప్రతిభను చాటేందుకు ప్లేయర్లు తహతహలాడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని పుణికిపుచ్చుకుని సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్నారు. దేశంలో తొలిసారి సీఎం కప్‌ పేరిట జరుగుతున్న క్రీడాటోర్నీకి అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ టోర్నీ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ ఏర్పాట్లపై ప్రత్యేక కథనం.

దేశంలో తెలంగాణ..మిగతా రాష్ర్టాలకు దిక్సూచిగా నిలుస్తున్న వైనం. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతూ ఆదర్శంగా నిలుస్తున్నది. దేశానికి మెరికల్లాంటి ప్లేయర్లను అందించాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలికి తీసేందుకు సీఎం కప్‌ పేరిట క్రీడాటోర్నీని రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్‌) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. అనుకున్నదే తడువుగా సీఎం ఆదేశాలకు అనుగుణంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ టోర్నీకి రూపకల్పన చేస్తూ అధికారులను సమాయత్తం చేశారు. హైదరాబాద్‌ వేదికగా ఈ నెల 28 నుంచి 31 తేదీ వరకు రాష్ట్ర స్థాయి టోర్నీ జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. దీనిపై సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఆరు వేదికల్లో:

సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు హైదరాబాద్‌లో మొత్తం ఆరు క్రీడా వేదికలను సిద్ధం చేశారు. ఇందులో ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి అథ్లెటిక్స్‌ స్టేడియం, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం, యూసుఫ్‌గూడ ఇండోర్‌ స్టేడియం, జింఖానా మైదానం, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ షూటింగ్‌ రేంజ్‌ ఉన్నాయి. ఇందులో మొత్తం 18 క్రీడాంశాల్లో ప్లేయర్లు పోటీపడనున్నారు. ప్రతీ స్టేడియానికి ఒక ఇన్‌చార్జ్‌ని నియమించారు. మొత్తం 33 జిల్లాల నుంచి 7500 మందికి పైగా ప్లేయర్లు వివిధ క్రీడాంశాల్లో బరిలోకి దిగనున్నారు.

వివిధ కమిటీలు:

పోటీలను విజయవంతం చేసేందుకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చైర్మన్‌గా, సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ కో చైర్మన్‌గా, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్లేయర్ల కోసం రవాణా, వసతి సౌకర్యాలు, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. టోర్నీ నిర్వహణ సందర్భంగా నగర వ్యాప్తంగా విద్యుత్‌ దీపాలతో కూడళ్లను సుందరీకరిస్తున్నారు. వైద్య, రవాణా సదుపాయాలు:

పోటీలు జరిగే స్టేడియాల్లో నిర్వాహకులు వైద్య, రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యం అందించేందుకు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నారు. మహిళా ప్లేయర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కప్‌ పోటీలను రాష్ట్రంలో తొలిసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా టోర్నీకి రూపకల్పన చేయడం జరిగింది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో టోర్నీని ఏర్పాటు చేశాం. దీనికి తోడు ఒలింపిక్స్‌, ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించే రీతిలో ప్లేయర్లను తీర్చిదిద్దాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళుతున్నాం. ఈ క్రమంలో ఇప్పటికే మండల, జిల్లా స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించాం. ఊహించని రీతిలో మండల స్థాయిలో రెండు లక్షల మంది, జిల్లా స్థాయిలో 70 నుంచి 80 వేల మంది ఆయా క్రీడా విభాగాల్లో పోటీపడి సత్తాచాటారు. మరోవైపు పరోక్షంగా దాదాపు ఐదు లక్షల మంది టోర్నీలో భాగమయ్యారు. రాష్ట్ర స్థాయి టోర్నీల్లో 18 క్రీడాంశాల్లో ఎనిమిది వేల మంది పోటీపడుతున్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతీ ఏడాది సీఎం కప్‌ టోర్నీని మరింత ఘనంగా నిర్వహిస్తాం. సత్తాచాటిన వారికి భవిష్యత్‌లో స్పోర్ట్స్‌ కోటాలో రిజర్వేషన్‌ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం.

క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన సీఎం కప్‌-2023 పోటీలను హైదరాబాద్‌లోని 6 స్టేడియంలలో నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రాష్ర్టాన్ని క్రీడా కేంద్రంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సత్సంకల్పంతో ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. మండల, జిల్లా స్థాయి పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో 7,800 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. – సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌

2023-05-27T22:23:26Z dg43tfdfdgfd