పొట్టి ఫార్మాట్ వచ్చాక 10 ఓవర్లలో 100 పరుగులు చేయడం పెద్ద లేక్క కాకపోవచ్చేమో కానీ.. ఒకప్పుడు వన్డేల్లో 250 రన్స్ చేస్తే మంచి స్కోరు సాధించినట్లే! అలాంటి సమయంలో 1996 ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదయ్యాయి. కొత్త ఫీల్డింగ్ నిబంధనలు ప్రవేశ పెట్టడంతో తొలి 15 ఓవర్లలో భారీ షాట్లతో పరుగలు వరద పారించడం పరిపాటి అయిపోయింది.
కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్‌లో ఓ మోస్తరుగా ఆడిన శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ సనత్ జయసూర్య.. ఈ టోర్నీలో ఓపెనర్‌గా విశ్వరూపం కనబర్చగా.. లంకేయులు అప్పట్లోనే నాలుగొందలకు చేరువయ్యారు. అర్జున రణతుంగ, అరవింద డిసిల్వ, సనత్ జయసూర్య, రమేశ్ కలువితరణ, రోషన్ మహానామా, చమిందా వాస్, ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజాలతో కూడిన లంక జట్లు.. సమిష్టి ప్రదర్శనతో తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. మరో 8 రోజుల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీలంక సృష్టించిన బీభత్సాన్ని గుర్తుచేసుకుందాం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం ;వన్డే క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్న ఆ రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1996 వరల్డ్‌కప్‌లో కీలక మార్పులు చేసింది. అప్పటి వరకు ఉన్న ఫీల్డింగ్ నిబంధనలను తొలగిస్తూ.. తొలి 15 ఓవర్ల పాటు బ్యాటింగ్ జటు ్టకు అనుకూలంగా పవర్‌ప్లేని ప్రవేశ పెట్టింది. దాంతో వన్డే క్రికెట్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు అడపా దడపా మాత్రమే 300 స్కోర్లు నమోదవుతుంటే.. ఇక అక్కడి నుంచి దంచినోడికి దంచినంత అన్నట్లు మారిపోయింది పరిస్థితి. 1992లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కలిసి మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వగా.. 96లో భారత్, శ్రీలంక, పాకిస్థాన్ సంయుక్తంగా ఆ బాధ్యతలు పంచుకున్నాయి. బెన్సన్ హెడ్జెస్ వరల్డ్‌కప్ కాస్తా.. విల్స్ ప్రపంచకప్‌గా రూపాంతరం చెందింది. అయితే అప్పట్లో లంకలో సివిల్ వార్ జరుగుతుండటంతో అక్కడ మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు వెనకడుగు వేశాయి. దీంతో అరవింద డిసిల్వా సారథ్యంలోని లంక ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అప్పటి వరకు తొలి 15 ఓవర్లలో 50 నుంచి 60 రన్స్ సాధిస్తే గొప్ప అనుకుంటుంటే.. ఈ టోర్నీలో లంక దుమ్మురేపింది. భారత్‌పై తొలి 15 ఓవర్లలో 117 పరుగులు చేసిన లంకేయులు, కెన్యాపై 123, ఇంగ్లండ్‌పై 121 పరుగులు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. ఈ క్రమంలో లీగ్‌దశ చివరి మ్యాచ్‌లో కెన్యాపై లంక 398 పరుగులు చేసింది. వన్డేల్లో అప్పటికి ఇదే అత్యధిక స్కోరు. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 235 పరుగులు చేయగా.. ఛేదనలో జయసూర్య చెలరేగిపోయాడు. 44 బంతుల్లోనే 82 పరుగులు చేసి జట్టను అలవోకగా సెమీస్‌కు చేర్చాడు. సెమీస్‌లో భారత్‌పై విజయం సాధించిన లంక.. తుదిపోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది.
ఈడెన్ గార్డెన్స్ రణరంగం
సొంతగడ్డపై భారీ అంచనాల మధ్య వరల్డ్‌కప్ బరిలోకి దిగిన భారత జట్టు.. సెమీఫైనల్లో శ్రీలంకతో అమీతుమీకి సిద్ధమైంది. ఫుల్ జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియా సొంతగడ్డపై టోర్నీ ఎగరేసుకోవడం ఖాయమే అనే నమ్మకంతో.. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మొదట లంక 251 పరుగులకే పరిమితం కావడంతో.. భారత విజయం నల్లేరుపై నడకే అనిపించింది. అందుకు తగ్గట్లే సచిన్ (66) దంచికొట్టడంతో టీమ్‌ఇండియా ఒక దశలో 98/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే సచిన్ ఔటయ్యాక పరిస్థితి తలకిందులైంది. మరో 22 పరుగుల వ్యవధిలో టీమ్‌ఇండియా 7 వికెట్లు కోల్పోయింది. ఇది తట్టుకోలేకపోయిన అభిమానులు మైదానంలోకి నీళ్ల సీసాలు విసిరారు. దీంతో ఆటకు కాసేపు అంతరాయం కలగగా.. తిరిగి ప్రారంభించినా అభిమానులు శాంతించలేదు. ఈ సారి మైదానంలోకి చేతికి అందిన వస్తువులు విసురుతూ బీభత్సం సృష్టించడంతో పాటు.. స్టాండ్స్‌కు నిప్పు పెట్టారు. దీంతో రిఫరీ లంకను విజేతగా ప్రకటించారు.
2023-09-27T00:11:04Z dg43tfdfdgfd