లక్నో టీ20లో సత్తా చాటిన స్పిన్నర్లు.. కివీస్ 20 ఓవర్లలో 99/8

లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టీ20లో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్ మీద కివీస్‌ను 20 ఓవర్ల 99/8 కే పరిమితం చేశారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఫిన్ అలెన్ రెండు ఫోర్లు బాది దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ చాహల్ రంగ ప్రవేశంతో న్యూజిలాండ్ కష్టాలు మొదలయ్యాయి. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ బౌలింగ్‌కు దిగిన మూడో బంతికే ఫిన్ అలెన్ (11)ను బౌల్డ్ చేశాడు.

తర్వాతి ఓవర్లో వరుసగా ఐదు వైడ్లు వేసిన వాషింగ్టన్ సుందర్ మరుసటి బంతికి కాన్వేను పెవిలియన్ చేర్చాడు. దీంతో న్యూజిలాండ్ 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. పది ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

12.4వ ఓవర్లో చాప్‌మన్ (14)ను హుడా ఔట్ చేయడంతో న్యూజిలాండ్ 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శాంట్నర్, బ్రాస్‌వెల్ ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో సిక్స్‌కు యత్నించిన బ్రాస్‌వెల్ (14) అర్షదీప్ సింగ్‌ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు. దీంతో ఆరో వికెట్‌కు 20 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

18 ఓవర్లో బౌలింగ్‌కు దిగిన అర్షదీప్ సింగ్ 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఇష్ సోధీ, లూకీ ఫెర్గ్యుసన్‌లను పెవిలియన్ చేర్చాడు. దీంతో కివీస్ 83 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 19వ ఓవర్లో శివమ్ మావి 11 పరుగులు ఇవ్వగా.. చివరి ఓవర్లో అర్షదీప్ ఐదు రన్స్ మాత్రమే ఇవ్వడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పరిమితమైంది.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా.. శివమ్ మావి మినహా మిగతా బౌలర్లందరికీ తలో వికెట్ దక్కింది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

2023-01-29T15:25:53Z dg43tfdfdgfd