ఫార్ములా ఈ రేస్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు
భారత్లో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ- రేసింగ్ జరగనుంది. హుసేన్‌సాగర్ వేదికగా ఫిబ్రవరి 11న జరుగనున్న అంతర్జాతీయ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్పై ఈ ఈవెంట్ నిర్వహించనుంది. 18 మలుపులతో ఉన్న ట్రాక్‌పై రేసింగ్ కార్లు రయ్ మంటూ దూసుకుపోనున్నాయి. ఈ రేస్‌లో 11 జట్లు, 22 మంది డ్రైవర్స్ పాల్గొంటారు. హైదరాబాద్ సర్క్యూట్‌లో అడుగడుగునా భద్రతా పరంగా ప్రత్యేకంగా భారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకుల కోసం గ్యాలరీలను నిర్మిస్తున్నారు.
ఫార్ములా ఈ రేస్ నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, మింట్ కాంపౌండ్ నుంచి ప్రసాద్ ఐమాక్స్ వరకు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ఫిబ్రవరి 17న ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, ఫార్ములా ఈ రేస్ ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి సమావేశం నిర్వహించారు. ఫార్ములా ఈ రేసు కారణంగా సచివాలయ పనుల్లో జాప్యం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
మరోవైపు కొత్త సచివాలయ భవనానికి అత్యున్నత భద్రత కల్పించాలని సీఎస్ శాంతి కుమారి పోలీసులను ఆదేశించారు. తెలంగాణ స్పెషల్ పోలీసులతో పాటు..300 మంది నగర పోలీసులు సచివాలయ భవన భద్రతను చూసుకోవాలన్నారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసుల నుంచి 22 మంది సిబ్బందిని కేటాయించారు. లగేజీ స్కానర్లు, వాహన స్కానర్లు, బాడీ స్కానర్లు వంటి భద్రతా పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
©️ VIL Media Pvt Ltd. 2023-02-01T14:35:39Z dg43tfdfdgfd