ఎక్కడ మొదలుపెట్టానో మళ్లీ అక్కడికే వచ్చాను: సూర్యకుమార్ యాదవ్

అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం జరగనుంది. తొలి టీ20లో కివీస్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. కాగా అహ్మదాబాద్ స్టేడియం సూర్యకుమార్ యాదవ్‌కు స్పెషల్. ఇక్కడే సూర్య అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2021లో ఇదే వేదికపై ఇంగ్లాండ్‌తో తొలి టీ20 ఆడిన సూర్య.. తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్‌గా మలిచాడు.

‘‘నేను డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చినప్పుడు.. ఎక్కడ మొదలుపెట్టానో మళ్లీ అక్కడికే వచ్చానంటూ టీమ్ మేనేజర్‌తో చెప్పాను. ఇక్కడ నాకు గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి’’ అని మూడో టీ20కి ముందు సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు.

ఇది అందమైన స్టేడియం, ప్రేక్షకులు అద్భుతం. రేపటి మ్యాచ్ ఎంతో ఉత్తేజకరంగా ఉండనుందని సూర్య తెలిపాడు. తొలి రెండు టీ20ల్లో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను రూపొందించడంలో తప్పేమీ లేదని సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. లక్నో పిచ్ షాకింగ్‌గా అనిపించిందని కెప్టెన్ హార్దిక్ పాండ్య చెప్పగా.. సూర్య అందుకు విరుద్ధంగా మట్లాడటం గమనార్హం.

‘ఎర్ర మట్టి, నల్ల మట్టి.. ఏ రకమైన మట్టి మీద ఆడుతున్నామనేది విషయం కాదు. అది మన కంట్రోల్‌లో ఉండదు. గత మ్యాచ్‌ల్లో పరిస్థితులకు అనుగుణంగా ఆడాం.. మేమేం చేయగలమో అదే చేశాం. లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ.. ఎగ్జయింట్ గేమ్ అది. టీ20 కావచ్చు లేదా 50 ఓవర్ల మ్యాచ్ కావచ్చు.. జట్ల మధ్య పోటీ ఉన్నప్పుడు రసవత్తరంగా ఉంటుంది. వికెట్ అనేది అంత పెద్ద విషయం కాదు. ఛాలెంజ్‌ను అంగీకరించి.. ముందుకు పోవడమే’ అని సూర్య తెలిపాడు. లక్నో టీ20లో 31 బంతుల్లో 26 పరుగులు చేసిన సూర్య జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌‌తో చివరి టీ20 ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తలపడనుంది. తొలి రెండు టెస్టుల కోసం ఎంపిక చేసిన జట్టులో సూర్య పేరు ఉన్న సంగతి తెలిసిందే. టీ20ల్లో సత్తా చాటిన సూర్యకు బీసీసీఐ లాంగ్ ఫార్మాట్లోనూ అవకాశం ఇచ్చింది. ఈ విషయమై సూర్య మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరూ టెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటారన్నాడు. ఎవరైనా దేశవాళీ కెరీర్ మొదలుపెట్టినప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌తోనే ప్రారంభిస్తారు. టెస్టు క్రికెట్ ఆడనుండటం ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉంది.. అదే సమయంలో రేపటి మ్యాచ్‌పై నేను ఫోకస్ చేశాను’ అని తెలిపాడు.

2023-01-31T15:26:54Z dg43tfdfdgfd