ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బీసీసీఐకి లాభాలను తెచ్చిపెట్టడమే కాకుండా అన్‌క్యాప్డ్ ప్లేయర్లను జాతీయ జట్టులోకి వేగంగా తీసుకెళ్లే ఒక అద్భుతమైన వేదిక.
గత సీజన్‌ల మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐపీఎల్‌లో దేశవాళీ ఆటగాళ్లు సత్తాచాటారు. టీమిండియాలో చోటు కోసం సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు.
క్రీడా రచయిత సాత్విక్ బిస్వాల్ అలాంటి ఐదుగురు ఆటగాళ్ల గురించి వివరించారు.
రింకూ సింగ్
ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఏడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆ జట్టులో కీలకమైన ఆటగాడిగా మారాడు రింకూ సింగ్.
రింకూ క్రీజులోకి వెళ్లిన ప్రతిసారీ జట్టు, అభిమానులు మ్యాచ్ గెలిపిస్తాడని ఆశించేవారు. కొన్ని క్లోజ్ రన్ ఛేజింగ్‌లలో రింకూ అలాగే విజయాన్ని అందించాడు.
అలాంటి ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగింది. ఆ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్లతో కోల్‌కతాను దెబ్బతీశాడు.
దీంతో కేకేఆర్‌కు పరాజయం తప్పదని భావించారు. అయితే రింకూ ప్లాన్‌లు వేరే ఉన్నాయి.
ఆ మ్యాచ్‌లో కోల్‌కతా విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరం. యశ్ దయాల్ బౌలింగ్‌కు వచ్చాడు. మొదటి బంతికి కోల్‌కతా బ్యాటర్ ఉమేశ్ యాదవ్ సింగిల్ తీశాడు.
దీంతో రింకూ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు. తర్వాత రింకూ వరుసగా ఐదు బంతులకు ఐదు సిక్సర్లు కొట్టి కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
కేకేఆర్ రింకూను వేలంలో రూ.55లక్షలు ఇచ్చి రీటెయిన్ చేసుకుంది. అయితే వచ్చే వేలంలో అతనికి భారీ ధర పలికే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2022లో రింకూ సింగ్ 34.8 సగటు 148.71 స్ట్రైక్ రేటుతో 174 పరుగులు చేశాడు.
ఇక ఈ సీజన్‌లో 59.25 సగటుతో దాదాపు 150 స్ట్రైక్ రేటుతో 474 పరుగులు సాధించాడు.
26 ఏళ్ల రింకూ సింగ్‌కు దేశవాళీలో ఉత్తర్‌ప్రదేశ్ తరఫున 100కి పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.
అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో రింకూ టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఐపీఎల్‌లో తిలక్ వర్మ బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. పరిస్థితులకు తగ్గట్లుగా నెమ్మదిగా ఆడుతూ అవసరమైనపుడు హిట్టింగ్ చేయగల నైపుణ్యం ఈ లెఫ్ట్ హ్యాండర్ సొంతం.
ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టుకు కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా మారాడు 21 ఏళ్ల హైదరాబాదీ తిలక్.
అయితే గాయం కారణంగా ద్వితీయార్థంలో జట్టుకు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన తిలక్ 42.88 సగటు, 164.11 స్ట్రైక్ రేటుతో 343 పరుగులు చేశాడు.
''వచ్చే 6 నుంచి 8 నెలల్లో తిలక్ వర్మ ఇండియా తరఫున టీ20 క్రికెట్ ఆడకపోతే నేను ఆశ్చర్యపోతాను'' అని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ స్టార్ స్పోర్ట్స్ తో అన్నారు.
"అతనిలో మెచ్యూరిటీ ఉంది. నైపుణ్యం ఉంది. తిలక్ భారత మిడిల్ ఆర్డర్‌తో ప్రపంచ క్రికెట్‌ను మార్చగలడు" అని తెలిపారు.
"అతనిలో నాకు నచ్చేది ఆడే తీరు. అతను భయపడడు" అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
"అతను బౌలర్‌ను పట్టించుకోడు, బంతిని మాత్రమే ఆడతాడు. తిలక్ ఆటతీరు అతని వయస్సులో ఉన్న ఆటగాళ్లు గమనించదగినది" అని రోహిత్ అన్నారు.
యశస్వీ జైశ్వాల్‌కి 12 ఏళ్లుండగా క్రికెట్ కోసం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ముంబయికి వచ్చారు.
జైశ్వాల్ టెంట్లలో నిద్రపోయేవాడు. డబ్బులు సంపాదించడానికి స్నాక్స్ అమ్మేవాడు.
ముంబయిలోని ఆజాద్ మైదానంలో జైశ్వాల్ క్రికెట్ ఆడేవాడు. ఆ మైదానం ఎప్పుడూ చిన్న పిల్లలతో నిండి ఉండేది.
లోకల్ కోచ్ కోచింగ్‌తో జైశ్వాల్ క్రికెట్ ప్రయాణం ఎదుగుతూ వచ్చింది.
ఈ ఏడాది 21 ఏళ్ల జైశ్వాల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
ఆర్ఆర్ జట్టు ప్లే ఆఫ్స్‌కి చేరడంలో విఫలమైనా జైశ్వాల్ 14 మ్యాచ్‌లలో 48.08 సగటు, 163.61 స్ట్రైక్ రేటుతో 625 పరుగులు సాధించాడు.
ఓ సెంచరీ, ఐదు అర్థ సెంచరీ కూడా చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా జైశ్వాల్ నిలిచాడు.
అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ (13) బంతుల్లో అర్థ సెంచరీ రికార్డును కూడా తన పేరిట నెలకొల్పాడు జైశ్వాల్.
29 ఏళ్ల జితేశ్ శర్మ పంజాబ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. 2022లో మంచి ఆటతీరు కనబరిచాడు. ఆ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 29.25 సగటు,163.63 స్ట్రైక్ రేటుతో 234 పరుగులు చేశాడు.
ఇక జితేశ్ ఈ ఏడాది ఐపీఎల్‌లో విధ్వంసక ఆటతీరు కనబరిచాడు. కొన్ని కీలకమైన ఇన్సింగ్స్ ఆడి పంజాబ్‌ను గెలిపించాడు. ఈ సీజన్‌లో జితేశ్ 309 పరుగులు సాధించాడు.
ఐపీఎల్‌కు ముందు జితేశ్ టీమిండియాకు సెలక్ట్ అయినప్పటికీ ఆడే అవకాశం దక్కలేదు.
దేశవాళీ సీజన్‌లో 60 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభం ఉంది.
టీ20 క్రికెట్ చాంపియన్‌షిప్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విదర్భ జట్టు నుంచి సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు.
ఇపుడు ఐపీఎల్‌లో సత్తా చాటడంతో సెలెక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉంది.
28 ఏళ్ల తుషార్ దేశ్‌పాండే రైట్ ఆర్మ్ సీమర్. గతేడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది.
ఈ సీజన్‌లో తుషార్ శ్రీలంక బౌలర్ మతీషా పతిరానతో కలిసి బంతితో చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
దేశ్‌పాండే బౌలింగ్‌లో వేగం ఎక్కువ ఉండదు. కానీ, తన సామర్థ్యం, ప్రణాళికకు కట్టుబడి ఉంటూ బౌలింగ్‌లో సత్తా చాటాడు.
ఈ సీజన్ ప్రారంభంలో దేశ్‌పాండేకు మంచి ఆరంభం దక్కలేదు. అతని లైన్, లెంగ్త్ మిస్ అయింది.
కానీ టీం మేనేజ్‌మెంట్, ధోనీ అండగా నిలవడంతో దేశ్‌పాండే తిరిగి పుంజుకుని సీఎస్‌కే తరఫున ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 ఆటగాళ్లలో దేశ్‌పాండే ఒకడు.
ఐపీఎల్‌లో సత్తా చాటడం, దేశవాళీ క్రికెట్‌కు ఆడిన అనుభవంతో దేశ్‌పాండే వచ్చే ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
2023-05-27T12:54:18Z dg43tfdfdgfd