క్రికెట్: 30ఏళ్ల కిందట సరిగ్గా ఈ రోజే టెస్టుల చరిత్రలో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ ఇది

ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది.

వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది.

ఈ సిరీస్‌ను 2-0 లేదా 3-1 తేడాతో గెలిస్తే, టెస్టు క్రికెట్‌లోనూ భారత జట్టు నంబర్-1 అవుతుంది.

ఆస్ట్రేలియా జట్టు గత 15 టెస్టు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే ఓడింది. అయితే, భారత్‌తో ఆడిన గత మూడు సిరీస్‌లలోనూ కంగారూ జట్టు ఓడింది.

ఇపుడు ఆస్ట్రేలియా జట్టును ఓడించి టెస్టు క్రికెట్‌లోనూ భారత్ తన సత్తా చాటగలదా?

దీనికి సమాధానం మరి కొద్దిరోజుల్లో దొరుకుతుంది. ఇపుడోసారి ఆస్ట్రేలియా జట్టు ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్ కథను గుర్తుచేసుకుందాం.

ఇప్పటికీ టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించిన మ్యాచ్‌గా అది నిలిచింది.

ఆ చిరస్మరణీయమైన, చారిత్రాత్మకమైన మ్యాచ్ జరిగి 2023 జనవరి 26కి 30 ఏళ్లయింది. 1993లో జనవరి 26న టెస్ట్ మ్యాచ్ చరిత్రలో అత్యల్ప పరుగులతో గెలిచిన రికార్డు నమోదైంది.

ఇది ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

ఈ రోజుల్లో టీ20, వన్డేలలో చివరి బంతికి లేదా 1 పరుగుతో గెలిచిన అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.

అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్కసారి మాత్రమే జరిగిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

అడిలైడ్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య ఆ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు కేవలం ఒక పరుగుతో గెలిచి, టెస్టు చరిత్రలో అత్యల్ప పరుగులతో గెలిచిన రికార్డు సృష్టించింది.

అందుకే జనవరి 26, 1993న అడిలైడ్ టెస్ట్‌ చరిత్ర సృష్టించింది.

టెస్ట్ క్రికెట్‌లో వెస్టిండీస్ స్వర్ణయుగం

వెస్టిండీస్ జట్టు అప్పట్లో చాలా బలంగా ఉండేది. 1976లో వెస్టిండీస్‌ను ఓడించడం చాలా కష్టంగా ఉండేది.

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం చుట్టూ ఉన్న ద్వీప సమూహాలకు చెందిన ఆటగాళ్లతో కూడింది ఈ వెస్టిండీస్ జట్టు. ఇది 1928 నుంచి అంటే 95 సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్ ఆడుతోంది.

ఇప్పటి వరకు 163 టెస్టుల సిరీస్‌లో 66 సిరీస్‌లు గెలిచింది. అప్పటి వారి స్వర్ణయుగంలో కరేబియన్ జట్టు 25 గెలిచింది. కేవలం రెండు మాత్రమే ఓడిపోయింది. తొమ్మిదింటిని డ్రా చేసుకుంది.

వెస్టిండీస్‌కు రెండుసార్లు వన్డే ప్రపంచకప్‌ను అందించారు కెప్టెన్‌ క్లైవ్ లాయిడ్. ఆ సమయంలో జట్టులో ఒకరి కంటే ఎక్కువ మంది బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు కీపింగ్ కూడా చేసేవారు.

జోయెల్ గార్నర్, మైఖేల్ హోల్డింగ్, మాల్కం మార్షల్, కర్ట్‌లీ ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్, ఇయాన్ బిషప్ వంటి భయంకరమైన ఫాస్ట్ బౌలర్లు.... లాయిడ్, వివియన్ రిచర్డ్స్, గోర్డాన్ గ్రీనిడ్జ్, బ్రయాన్ లారా, డెస్మండ్, ఫిల్ సిమ్మన్స్, లారీ గోమెస్, రిచీ రిచర్డ్‌సన్ వంటి భీకర బ్యాటర్లు ఉండేవారు.

1960లలో క్రికెట్ మీద వెస్టిండీస్ జట్టు చెరిగిపోని ముద్ర వేసింది. ఆ జట్టు అత్యున్నత దశను చూసింది. నేటికీ ఆ రోజుల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు.

1993లో జరిగిన అడిలైడ్ టెస్టులో ఏం జరిగింది?

వెస్టిండీస్ క్రికెట్ స్వర్ణయుగం క్షీణిస్తున్న సమయమది.

అప్పుడు వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. టెస్టు సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో రెండో మ్యాచ్ జరిగింది.

ఆ టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ చేసిన ఫిల్ సిమన్స్, డెస్మండ్ హేన్స్ జోడీ 84 పరుగులతో మంచి ఆరంభాన్నిచ్చారు.

అయితే ఆ తరువాత వచ్చిన వారిలో బ్రయాన్ లారా, జూనియర్ ముర్రే మినహా మిడిల్ ఆర్డర్‌లో మిగతా వాళ్లు విఫలమయ్యారు.

కరీబియన్ జట్టు తడబడుతూ బ్యాటింగ్ చేసింది. 252 పరుగుల స్కోరుకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మెర్వ్ హ్యూస్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 213 పరుగులు మాత్రమే చేసింది. స్టీవ్ వా 42 పరుగులు, మెర్వ్ హ్యూస్ 43 పరుగులు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌‌లో స్వల్ప ఆధిక్యం లభించినా రెండో ఇన్నింగ్స్‌లో కరీబియన్‌ జట్టు 146 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.

ఇందులో దాదాపు సగం (72) పరుగులు కెప్టెన్ రిచర్డ్‌సన్ కొట్టినవే.

నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన టిమ్ మే 41 బంతుల్లో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

మొత్తానికి ఆస్ట్రేలియా ముందు 186 పరుగుల విజయ లక్ష్యం ఉంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ బూన్ (0), మార్క్ టేలర్ (7) తొందరగానే ఔటయ్యారు.

26 పరుగులు చేసి మార్క్ వా కూడా పెవిలియన్ చేరాడు. జస్టిన్ లాంగర్ మాత్రం హాఫ్ సెంచరీ (54) సాధించాడు. మిగతావారు రాణించకపోవడంతో ఆసీస్ 144 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.

https://twitter.com/cricketcomau/status/824565697250414595

చివర్లో వచ్చి చెమటలు పట్టించారు

ఆస్ట్రేలియా జట్టు విజయానికి ఇంకా 42 పరుగుల దూరంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎండ్‌లో టిమ్ మే, మరో ఎండ్‌లో క్రెయిగ్ మెక్‌డెర్మాట్ ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఆడి స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. జట్టు స్కోరు 184 పరుగులకు తీసుకెళ్లారు.

విజయం కేవలం రెండు పరుగుల దూరంలో ఉంది. కోర్ట్నీ వాల్ష్ బౌలింగ్ చేస్తున్నాడు. క్రైగ్ మెక్‌డెర్మాట్‌ బ్యాటింగ్ చేస్తున్నాడు.

వాల్ష్ బౌన్సర్ సంధించాడు. ఆ బంతి మెక్‌డెర్మాట్‌ గ్లోవ్స్‌ దగ్గరి నుంచి వికెట్ వెనుకకు వెళ్లింది. అంపైర్ ఔటిచ్చాడు. దీంతో ఓటమి అంచున నిలిచిన వెస్టిండీస్ జట్టు ఒక పరుగుతో విజయం సాధించింది. అంతేకాకుండా తర్వాతి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకుంది.

అయితే టీవీ రీప్లేలలో బంతికి, గ్లోవ్స్‌కు మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లు స్పష్టంగా కనిపించడంతో అంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా ఉంది.

మ్యాచ్ ఫలితంపై బోర్డర్, రిచర్డ్‌సన్ ఏమన్నారు?

ఆన్-ఫీల్డ్ ఆస్ట్రేలియన్ అంపైర్ డారెల్ హెయిర్ మెక్‌డెర్మాట్‌‌ను ఔట్‌గా ప్రకటించారు.

అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు అప్పీల్ చేసినా డారెల్ హెయిర్ ఆయన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

వాల్ష్ బంతి మెక్‌డెర్మాట్ చేతిని తాకకుండా వికెట్ వెనుకకు వెళ్లిందని టీవీలో యాక్షన్ రీప్లేలు స్పష్టంగా చూపించాయి.

మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ అలన్ బోర్డర్ అంపైర్ డారెల్ నిర్ణయాన్ని ప్రశ్నించలేదు. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు.

బోర్డర్ మాట్లాడుతూ "ఇది మ్యాచ్ ఫలితం చెప్పే దగ్గరి నిర్ణయం. మీరెమంటారు? ఒక పరుగు? రోజు ప్రారంభంలో మేం 186 పరుగులు చేస్తామనుకున్నాం'' అన్నారు.

అదే సమయంలో కరీబియన్‌ జట్టు కెప్టెన్‌ రిచర్డ్‌సన్‌ మాట్లాడుతూ.. ''ఆ బంతికి వాల్ష్‌ వికెట్‌ తీస్తాడన్న భావన కలిగింది. నేను అస్సలు ఆశ వదులుకోలేదు" అన్నారు.

ఇద్దరు కెప్టెన్లు ఆ మ్యాచ్‌లో హీరో అయిన వెస్టిండీస్ బౌలర్‌ వాల్ష్‌ను ప్రశంసించారు.

ఈ మ్యాచ్‌ ఫలితాన్ని కోర్ట్నీ వాల్ష్ నిర్ణయించినా, ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్ పతనానికి కారణం ఆంబ్రోస్.

ఆయన వేసిన ప్రతి బంతి కంగారూ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందులు పెట్టింది. లంచ్ తర్వాత సంధించిన 19 బంతులూ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాయి. డేవిడ్ బూమ్, స్టీవ్ వా, అలెన్ బోర్డర్, మెర్వ్ హ్యూస్‌లు ఆంబ్రోస్ దెబ్బకు పెవిలియన్ చేరారు.

మురళీధరన్ బౌలింగ్‌లో వరుస నో బాల్స్

అయితే ఈ మ్యాచ్ డారెల్ హెయిర్ వివాదాస్పద అంపైరింగ్ కెరీర్‌కు నాంది పలికింది 1992లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అంపైర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హెయిర్.. పలు వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకెక్కారు. ఐసీసీ ఆయనను అంపైరింగ్ నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శ్రీలంక స్టార్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్‌ను తప్పుగా అంచనా వేశారు అంపైర్. కెప్టెన్ అర్జున రణతుంగ, మురళీధరన్‌ను బౌలింగ్ నుంచి తొలగించే వరకు హెయిర్ నో-బాల్స్ ఇస్తూనే ఉన్నారు.

మూడు ఓవర్లలో ఏడు బంతులను చక్ చేశాడని ఆరోపిస్తూ హెయిర్ నో బాల్స్ ఇచ్చారు.

ఆ మ్యాచ్ రెండో అంపైర్ అయిన న్యూజిలాండ్‌కు చెందిన స్టీవ్ డన్‌కు మాత్రం మురళీధరన్ బౌలింగ్ యాక్షన్‌లో ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు.

హెయిర్స్ మురళీధరన్ బంతులపై తీసుకున్న నిర్ణయాలకు కెప్టెన్ అర్జున రణతుంగ ఆగ్రహంతో జట్టును మైదానం బయటకు తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత జట్టుతో కలిసి మళ్లీ మైదానంలోకి వచ్చాడు రణతుంగ.

ఆసీస్ జైత్రయాత్రకు పునాది

"వెస్టిండీస్ పర్యటనలో అడిలైడ్ టెస్ట్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది కరేబియన్ జట్టు ఆధిపత్యానికి సవాలు విసిరిన సందర్భం" అని సైమన్ హ్యూస్ యాషెస్ సందర్భంగా రాశాడు.

ఆస్ట్రేలియా 1987 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 1992 వన్డే ప్రపంచ కప్‌ నిర్వహించింది. కంగారూ జట్టూ నిలకడగా రాణిస్తోంది.

అయితే కరీబియన్‌ ఆటగాళ్లు స్వదేశీ మైదానాల్లోనే కాదు.. విదేశీ గడ్డపై కూడా తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.

అటువంటి పరిస్థితిలో 1993 ఆస్ట్రేలియా పర్యటన వెస్టిండీస్ ఆధిపత్యాన్ని సవాలు చేయడంలో ముఖ్యమైన మలుపు.

1983లో వన్డే ప్రపంచకప్‌ను భారత్, 1987లో ఆస్ట్రేలియా జట్లు గెలుచుకున్నప్పటికీ ఈ కాలంలో వెస్టిండీస్ జట్టు టెస్టు క్రికెట్‌లో ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు.

కానీ 1993 ఆస్ట్రేలియా పర్యటన వారి ఆధిపత్యానికి సవాల్ విసిరింది.

1995లో ఈ ఆస్ట్రేలియా జట్టు దాదాపు 15 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గెలిచింది. దీంతో క్రికెట్‌లో కొత్త రాజు పుట్టుకొచ్చాడు.

ఇపుడు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వస్తోంది. టెస్ట్ క్రికెట్‌లో కంగారూ జట్టు నంబర్-1 ర్యాంకులో ఉంది. భారత జట్టు ర్యాంకు నంబర్-2.

ఒకవేళ ఆసీస్‌పై భారత్ గెలిస్తే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో భారత జట్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-01-26T15:25:07Z dg43tfdfdgfd