ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచాడు. గ్రీస్‌కు చెందిన మూడో సీడ్ సిట్సిపాస్‌తో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 7-6, 7-6 తేడాతో జకోవిచ్ వరుస సెట్లలో గెలుపొందాడు. దీంతో రికార్డ్ స్థాయిలో పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను గెలుపొందాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన ఆటగాడిగా రఫెల్ నాదల్ (22) రికార్డును జకోవిచ్ సమం చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడం ద్వారా జోకర్ మరోసారి టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోనున్నాడు.

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో 35 ఏళ్ల జకోవిచ్ తన అనుభవాన్ని రంగరించి ఆడాడు. మూడో సెట్లలోనూ ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని కనబర్చాడు. 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సిట్సిపాస్‌ను ఓడించిన జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. దీంతో సిట్సిపాక్‌పై తన విజయాల రికార్డును జకోవిచ్ 11-2కు మెరుగుపర్చుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లో గెలవగానే జకోవిచ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్ వరుసగా 28 మ్యాచ్‌లు గెలుపొందడం విశేషం.

అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల విషయానికి వస్తే.. 22 టైటిళ్లతో నాదల్ తొలి స్థానంలో ఉండగా.. జకోవిచ్ అతణ్ని సమం చేశాడు. రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు.

జకోవిచ్ కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదనే కారణంతో యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని జకోవిచ్‌ను అమెరికా తమ దేశంలోకి అనుమతించలేదు. దీంతో తాను యూఎస్ ఓపెన్‌లో ఆడలేకపోతున్నానని జకోవిచ్ తెలిపాడు. జకో 2011, 2015, 2018ల్లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలుపొందాడు. ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచాడు.

2023-01-29T12:25:49Z dg43tfdfdgfd