ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. యువ ఆర్చర్ హర్విందర్‌సింగ్ కొత్త చరిత్ర లిఖించాడు. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకుంటూ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టోక్యోలో కాంస్య కాంతులు విరజిమ్మిన ఈ హర్యానా ఆర్చర్.. పారిస్‌లో పసిడి పతకంతో వెలుగులు అద్దాడు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో అపజయమన్నదే లేకుండా ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేసిన హర్విందర్ ఓవరాల్‌గా సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో తొలి స్వర్ణాన్ని అందించాడు. తామేం తక్కువ కాదన్నట్లు అథ్లెటిక్స్‌లో భారత్ పాంచ్ పటాకా మోగించారు. హైజంప్, జావెలిన్‌త్రోలో మన పారా అథ్లెట్లు డబుల్ ధమాకాతో చెలరేగగా, షాట్‌పుట్‌లో సచిన్ వెండి పతకం ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఆరు పతకాలతో టార్గెట్-25 రేసులో 22 పతకాలతో భారత్ దూసుకెళుతున్నది.
పారిస్: పారాలింపిక్స్ ఆరంభంలో షూటర్లు, షట్లర్లు భారత్‌కు పతకాల పంట పండిస్తే గత రెండ్రోజుల నుంచి ఆ బాధ్యతను మన అథ్లెట్లు తీసుకున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల హైజంప్, జావెలిన్ త్రోలో దేశానికి మరో నాలుగు పతకాలు దక్కాయి. ప్రఖ్యాత స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం వేదికగా జరిగిన పురుషుల హైజంప్ (టీ63)లో శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్ రజత, కాంస్యాలతో మెరిశారు. తంగవేలుకు ఇది వరుసగా మూడో పారాలింపిక్స్ పతకం కాగా శరద్‌కు రెండోది. జావెలిన్ త్రోలో అజిత్, సుందర్ విసిరిన బరిసె.. వెండి, కాంస్యాలను పట్టుకొచ్చింది. బుధవారం జరిగిన పురుషుల షాట్‌పుట్ (ఎఫ్46)లో సచిన్ ఖిలారి సిల్వర్ గెలిచి భారత పతకాల సంఖ్యను 21కి పెంచాడు. ఆర్చరీలో భారత్‌కు హర్విందర్ సింగ్ తొలి స్వర్ణం అందించాడు.
పురుషుల హైజంప్ ఈవెంట్‌లో భారత అథ్లెట్లు దుమ్మరేపారు. 8 మంది పాల్గొన్న ఫైనల్‌లో భారత్.. రజతం, కాంస్యంతో పాటు నాలుగో స్థానంలోనూ నిలిచి సత్తా చాటింది. శరద్ (టీ42) 1.88 మీటర్ల ఎత్తుకు దూకి పారాలింపిక్స్‌లో రికార్డులు బ్రేక్ చేశాడు. దీంతో టోక్యోలో తంగవేలు మరియప్పన్ నమోదుచేసిన 1.86 మీటర్ల రికార్డు కనుమరుగైంది. శరద్‌కు ఇది వరుసగా రెండో పారాలింపిక్స్ పతకం. గతంలో అతడు టోక్యోలోనూ కాంస్యం సాధించాడు. ఇక రియోలో స్వర్ణం, టోక్యోలో రజతం గెలిచిన తంగవేలు.. పారిస్‌లో కాంస్యం సాధించి వరుసగా మూడు పారాలింపిక్స్‌లో పతకాలు గెలుచుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. పారిస్‌లో తంగవేలు 1.85 మీటర్ల ఎత్తు దూకాడు. అమెరికా అథ్లెట్ ఫ్రెచ్ ఎజ్రా (1.94 మీటర్లు) అగ్రస్థానంతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో భారత్‌కే చెందిన కుమార్ శైలేష్ నాలుగో స్థానంలో నిలిచాడు.
పురుషుల జావెలిన్ త్రోలో ఇది వరకే సుమిత్ అంటిల్ (ఎఫ్64) భారత్‌కు పసిడి వెలుగులు పంచగా ఎఫ్46 క్రీడాంశంలోనూ మన అథ్లెట్లు దేశానికి వెండి, కాంస్య పతకాలు అందించారు. ఐదో ప్రయత్నంలో ఈటెను 65.62 మీటర్ల దూరం విసిరిన అజీత్ సింగ్ రజతం దక్కించుకున్నాడు. నాలుగో ప్రయత్నంలో 64.96 మీటర్లతో గుర్జార్ సుందర్ సింగ్ కాంస్యాన్ని ముద్దాడాడు.
ఆర్చరీలో భారత ఆర్చర్ హర్వీందర్ సింగ్ సంచలన ప్రదర్శనతో స్వర్ణం గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఫైనల్‌లో హర్వీందర్ సింగ్ 6-0తో లుకాస్ సిస్‌జెక్ (పోలండ్) ను ఓడించడంతో పారాలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్స్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారత ఆర్చర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. ర్యాంకింగ్ రౌండ్‌లో 637 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచిన అతడు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ క్వార్టర్స్ చేరాడు. క్వార్టర్స్‌లో 6-2తో హెక్టార్ జులియొ (కొలంబియా)ను ఓడించాడు. సెమీఫైనల్స్‌లో 7-3తో మహ్మద్ రెజా అరబ్ (ఇరాన్)ను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించాడు. ఇక ఫైనల్‌లో హర్విందర్ తొలి సెట్‌లో (మూడు షాట్లు)నే 9, 9, 10తో 28 పాయింట్లు స్కోరు చేయగా ప్రత్యర్థి 24 పాయింట్లే రాబట్టాడు. రెండో సెట్‌లో బాణాన్ని రెండు సార్లూ పది పాయింట్ల సర్కిల్‌లోకి పంపిన హర్విందర్.. విజయాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. ఇక మూడో సెట్‌లో లుకాస్ 25 పాయింట్లే చేయగా హర్విందర్ 29 పాయింట్లు సాధించి విజయంతో మ్యాచ్‌ను ముగించాడు. టోక్యోలో కాంస్యం గెలిచిన ఈ హర్యానా ఆర్చర్‌కు పారిస్‌లో పసిడి దక్కడం విశేషం.
హైజంప్, జావెలిన్ త్రోలో మన అథ్లెట్ల విజయాలు ఇచ్చిన స్ఫూర్తితో పురుషుల షాట్‌పుట్ (ఎఫ్46) బరిలో నిలిచిన ఖిలారి సచిన్ సర్జేరావు దేశానికి మరో రజతాన్ని అందించాడు. ఫైనల్‌లో సచిన్.. ఇనుపగుండును 16.32 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. గోల్డ్ మెడల్ కొట్టిన స్టీవర్ట్ గ్రెగ్ (16.38) కంటే 0.06 మీటర్ల దూరం తక్కువ విసరడంతో సచిన్ బంగారు పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బకొవిచ్ లుకా (క్రొయేషియా.. 16.27) కాంస్యం నెగ్గాడు. ఈ ఈవెంట్‌లో మనదేశానికి చెందిన మహ్మద్ యసీర్, కుమార్ రోహిత్ 8,9 స్థానాలలో నిలిచారు.
ప్రతీ వీరుని విజయం వెనుక ఒక అలుపెరుగని గాథ ఉంటుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్న వైనం ఆ అపూర్వ విజయానికి సోపానం అవుతుంది. అన్ని అవయవాలు ఉన్నవాళ్లే ఆపసోపాలు పడుతున్న వేళ దివ్యాంగుడైన హర్విందర్‌సింగ్ అద్భుతమే చేశాడు. పారిస్ పారాలింపిక్స్‌లో పసిడి పతకంతో కొత్త చరిత్రకు నాంది పలికాడు. వైకల్యాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా ఆర్చరీలో అరుదైన ఘనత సొంతం చేసుకున్న సింగ్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పాలి. హర్యానాలోని కైతాల్ జిల్లా అజిత్‌నగర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన హర్విందర్‌సింగ్ ఏడాదిన్నర వయసులో ఉన్నప్పుడు డెంగ్యూకు చికిత్స తీసుకుంటున్న సమయంలో మందుల ప్రభావంతో కాళ్లు చచ్చుబడి పోయాయి. కొడుకు ఆసక్తి గమనించిన అతని తండ్రి వ్యవసాయ పొలంలో ఆర్చరీ రేంజ్ ఏర్పాటు చేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సింగ్..పారిస్‌లో పసిడితో కోట్లాది మందికి ప్రేరణగా నిలిచాడు.
2024-09-04T23:34:57Z dg43tfdfdgfd