భారత క్రికెట్‌లోకి ఓ నయా సంచలనం దూసుకొచ్చింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగి అసమాన ప్రదర్శనతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నది. ప్రతిభకు హద్దులు లేవని చేతల్లో చూపిస్తూ తన సత్తాఏంటో ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పింది. తనను తక్కువ అంచనా వేసిన వారికి దిమ్మతిరిగే సమాధానం చెబుతూ దేశం దృష్టిని ఆకర్షించింది. మలేషియా వేదికగా తాజాగా ముగిసిన ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను భారత్ రెండోసారి కైవసం చేసుకోవడంలో మన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కీలకంగా వ్యవహరించింది. దూకుడైన బ్యాటింగ్‌కు తోడు ఉపయుక్తమైన బౌలింగ్‌తో ప్రత్యర్థుల భరతం పట్టింది. ప్రతీ మ్యాచ్‌పై తనదైన ముద్ర వేసిన త్రిష..‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. పసి ప్రాయం నుంచే మొదలైన తన క్రికెట్ ప్రస్థానంలో కలల సాకారానికి ఒక్కో అడుగు వేస్తున్నట్లు చెప్పిన త్రిష.. భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించింది. భారత సీనియర్ జట్టులో చోటే లక్ష్యమంటున్న త్రిషతో మాటమంతి.
ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్ గెలువడం చాలా సంతోషంగా ఉంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే పరిమితం చేస్తూ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించాం. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై నాతో పాటు ఆయూశి, వైష్ణవిశర్మ చెలరేగడంతో సఫారీలు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. దీనికి తోడు మెగాటోర్నీలో ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోర్లకు కట్టడి చేయడం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అదే ఒరవడి ఫైనల్లోనూ కొనసాగించాం. నా వరకు ఈ ప్రపంచకప్ చాలా స్పెషల్. ఎందుకంటే రెండేండ్ల క్రితం ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ నేను ఉన్నాను. రెండు ప్రపంచకప్‌లు సొంతం చేసుకోవడం అరుదైన సందర్భం.
ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టుకు బాగా లాభించింది. టీమ్‌కు అవసరమైన ప్రతీసారి నా పాత్రను చక్కగా నిర్వహించాను. మెగాటోర్నీకి ముందే ఎవరెవరు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలో నిర్ణయించారు. అందుకే తగ్గట్లు గత ప్రపంచకప్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నేను ..ఈసారి నాకు ఇష్టమైన ఓపెనర్ పొజిషన్‌లో వచ్చాను. అది నాకు ఒక రకంగా కలిసొచ్చింది. ప్రత్యర్థి బౌలర్లపై మొదటి నుంచే దూకుడు ప్రదర్శిస్తూ పరుగులు సాధించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బౌలింగ్ విషయానికొస్తే..స్కాట్లాండ్ మ్యాచ్‌తో పాటు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై నా బౌలింగ్ బాగా పనికొచ్చింది. పిచ్‌పై అంచనాకు వస్తూ లెగ్‌స్పిన్‌తో వికెట్లు పడగొట్టాను. జట్టుకు అవసరమైన ప్రతీసారి నా పాత్రను చక్కగా నిర్వర్తించాను.
ఊహ తెలియని వయసు నుంచే క్రికెట్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్న నేను..భారత సీనియర్ మహిళల జట్టులో చోటే లక్ష్యంగా ముందుకెళుతున్నాను. అందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. అదీ ఎలాంటి టోర్నీ అయినా సత్తాచాటడమే పనిగా పెట్టుకున్నాను. తాజా ప్రపంచకప్, అంతకుముందు జరిగిన ఎమర్జింగ్ ఆసియాకప్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాను. ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడే గీటురాయి రాణిస్తున్నాను. టోర్నీకి టోర్నీకి అనుభవం కొద్ది ఆటతీరును మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఏనాటికైనా జాతీయ సీనియర్ జట్టు తరఫున ఆడి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నదే నా తపన. అందుకోసం ఎలాంటి అవరోధాలు ఎదురైనా వెరువకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తాను.
ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉండటానికి నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహమే. రెండేండ్ల వయసు నుంచే నాతో ఓనమాలు నేర్పించిన తండ్రి రామిరెడ్డి త్యాగం వెలకట్టలేనిది. నాకోసం ఆయన ఉద్యోగాన్ని వదులుకోవడంతో పాటు మెరుగైన శిక్షణ కోసం పొలం అమ్ముకుని హైదరాబాద్‌కు వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కెరీర్ ఎదుగుదలలో తండ్రి ప్రోత్సాహం మరువలేనిది. ఆయన శ్రమకు విలువనిస్తూ కోచ్‌ల సహకారంతో నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. నేను మ్యాచ్‌లు ఎక్కడ ఆడినా..అక్కడికి వస్తూ ప్రోత్సహించడం వల్లే జాతీయ స్థాయికి ఎదగగలిగాను. ఆయనే నాకు సర్వస్వం. అందుకే ఆయన కష్టానికి గుర్తుగా ప్రపంచకప్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అంకితమిచ్చాను.
2025-02-03T22:57:10Z