లక్ష మంది నోళ్లు మూయించిన కమిన్స్.. మోదీ చేసిన పనికి నోరెళ్లబెట్టాడు..!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 1.3 లక్షల మంది అభిమానుల మద్దతుతో ఫైనల్లోకి బరిలోకి దిగిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురైంది. ఫైనల్‌కు ముందే భారత్‌‌కు వార్నింగ్ ఇచ్చిన కమిన్స్ అన్నంత పని చేశాడు. 1.3 లక్షల మంది నోళ్లు మెదపకుండా చేయడం కంటే ఏదీ సంతృప్తిని ఇవ్వదంటూ వ్యాఖ్యానించిన కమిన్స్.. ఫైనల్లో టీమిండియాను ఓడించడం ద్వారా దాన్ని అక్షరాలా చేసి చూపించాడు.

అయితే భారత అభిమానుల నోళ్లు మూయించిన కమిన్స్‌కు మన ప్రధాని మోదీ నుంచి ఊహించని షాక్ ఎదురైంది. కోట్లాది మంది అభిమానుల నోళ్లు మూయించిన కమిన్స్ నోరెళ్లబెట్టేలా మోదీ చేయగలిగారు.

అదేంటంటే.. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ప్రధాని మోదీ చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మారెల్స్‌తో కలిసి పోడియం మీదకు వచ్చి.. కమిన్స్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన మోదీ.. అభినందనపూర్వకంగా ఓ రెండు మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనతోపాటు రిచర్డ్‌ను కూడా తీసుకెళ్లారు.

మోదీతో కలిసి ఫొటోలకు పోజులిద్దామనకున్నాడేమో కమిన్స్.. భారత ప్రధాని వైపు తిరిగే లోపే.. ఆయన అక్కడి నుంచి వెనుదిరిగాడు. దీంతో ఇప్పుడు ఈ వేదిక మీద నేనొక్కడినే ఏం చేయాలి అన్నట్టుగా చేతుల్లో ట్రోఫీతో కమిన్స్ రియాక్షన్ ఇచ్చాడు. అనంతరం ప్రధాని మోదీ స్టేజీ కింద ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కరచాలనం చేశారు. దీంతో వారంతా తన దగ్గరకు వచ్చేంత వరకూ ఆసీస్ కెప్టెన్ ఒక్కడే స్టేజీ మీద ఉండిపోయాడు. కాసేపటికి వాళ్లంతా వచ్చాక సంబరాలు చేసుకున్నారు.

ఇలా జరగడానికి సమన్వయ లోపం కారణం. ఇటు ప్రధాని కానీ, అటు ఆసీస్ ఆటగాళ్లు కానీ కావాలని ఇలా చేయలేదు. 2006లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. నాటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. ట్రోఫీ ఇచ్చాక పవార్ కాసేపు పోడియం మీదే ఉండగా.. సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో కెప్టెన్ రిక్కీ పాంటింగ్ అత్యుత్సాహంతో పవార్‌ను వేదికపై నుంచి వెళ్లాలి అన్నట్టుగా నెట్టేశాడు. అనంతరం పాంటింగ్ పవార్‌కు సారీ చెప్పాడు. ఈ వీడియో ఈ మధ్య కూడా వైరల్ కాగా.. గిల్‌క్రిస్ట్ ఆ రోజు ఏం జరిగిందో చెప్పాడు.

ఈ అనుభవం నేపథ్యంలో.. ఒకింత సంయమనం పాటించాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు భావించి ఉంటారు. అదీగాక ట్రోఫీని అందజేసేది స్వయానా భారత ప్రధాని కావడంతో మరింత జాగ్రత్తపడ్డారు. అదే సమయంలో మన జట్టు ఓడిన బాధతోపాటు.. ఈ ఆసీస్ ప్లేయర్లకు అత్యుత్సాహం ఎక్కువ కదా.. ముందే వెళ్లిపోతే బాగుంటుందని మోదీ వేదికపై ఎక్కువ సేపు ఉండటానికి ఇష్టపడలేదు. కాకపోతే అంతకు ముందే కమిన్స్‌ను అభినందించి వేదికపై విలువైన సమయాన్నే అతడితో గడిపారు. అయితే మోదీ వెళ్లిపోవడంతో కమిన్స్ చేతుల్లో కప్‌తో వేదికపై ఒంటరిగా కాసేపు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు.

2023-11-20T04:13:16Z dg43tfdfdgfd