రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి‌కి గ్రాండ్ ఫేర్‌వెల్.. క్రికెట్ ఆస్ట్రేలియా ప్లానింగ్!

టీమిండియా లెజెండ్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు గ్రాండ్ ఫేర్‌వెల్ ఇచ్చేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్లాన్ చేస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2024లో ఛాంపియన్స్‌గా నిలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ.. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‌ ముందు టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. బీసీసీఐ కూడా ఇప్పటివరకు ఈ స్టార్ బ్యాటర్స్ వీడ్కోలు గురించి ఆలోచించలేదు. అలాంటిది క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌కు వీళ్లు చేసిన సేవను గుర్తుంచుకుని గ్రేట్ సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తోంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చివరగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపారు. టీ20, టెస్టులకు గుడ్ బై చెప్పడంతో ఇకపై వీరిద్దరూ వన్డేల్లో మాత్రమే కనిపించనున్నారు. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మళ్లీ కనిపించనున్నారు. అక్టోబర్‌లో మళ్లీ ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడనున్నారు.

రోకో (రోహిత్-కోహ్లి)లకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 చివరిది అని అందరూ అనుకుంటున్నారు. ఈ లెక్కన ఆస్ట్రేలియా వేదికగా ఈ ఇద్దరు లెజెండ్స్‌కి అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీసే చివరి టూర్ అవ్వనుంది. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా కూడా రోహిత్, కోహ్లిల కోసం ఇప్పటి నుంచే వీడ్కోలు వేడుకల కోసం ప్లానింగ్ మొదలుపెట్టింది.

"విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను మా దేశంలో చూడటం బహుశా ఇదే చివరిసారి అనుకుంటున్నాను. ఎవరేం తెలుసు.. అదే చివరి సారి కూడా కాకపోవచ్చు. ఒకవేళ అదే నిజమయితే, అంతర్జాతీయ క్రికెట్‌కు వారు చేసిన సేవలకు మేమ మాత్రం చాలా గొప్ప వీడ్కోలు ఇస్తాము" అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్ బర్గ్ అన్నాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ కూడా ఒకేసారి రిటైర్మెంట్లు ప్రకటించడం విశేషం. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇద్దరూ ఒకేసారి పొట్టి ఫార్మాట్‌కు ఫుల్ స్టాప్ పెట్టారు. టెస్టు క్రికెట్‌లో మాత్రం రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటించిన రెండు రోజులకే విరాట్ కోహ్లి కూడా గుడ్ బై చెప్పాడు. వీరిద్దరూ కలిసి టీ20 వరల్డ్‌కప్‌తో పాటు భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. రోహిత్ శర్మ చిరకాల కల వన్డే వరల్డ్‌కప్ సొంతం చేసుకుని యాభై ఓవర్ల ఫార్మాట్‌కు కూడా ఇద్దరూ ఒకేసారి గుడ్ బై చెప్తారేమో చూడాలి.

2025-06-08T09:51:25Z