రోహిత్ శర్మ ఎక్కడ? అభిమాని ప్రశ్నకు పంత్ పంచ్.. హిట్ మ్యాన్ క్లాస్ యాదికొచ్చినట్టుంది!

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లాండ్‌కు బయలుదేరింది. శుక్రవారం ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరింది. ఈ జట్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సహా ఇతర ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ పలకడంతో వీరిద్దరూ లేకుండానే భారత జట్టు.. ఇంగ్లాండ్‌కు పయనమైంది. ఇక ఎయిర్‌పోర్ట్‌లో రిషభ్ పంత్‌కు ఇదే అంశంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై అతడు ఇచ్చిన ఫన్నీ రిప్లే నవ్వులు పూయించింది.

ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి రిషభ్ పంత్.. టీమ్ సభ్యులతో కలిసి ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ అభిమాని.. రోహిత్ శర్మ ఎక్కడ? అని రిషభ్ పంత్‌ను అడిగాడు. దానికి పంత్ ఫన్నీ రిప్లే ఇచ్చాడు. “రోహిత్ గార్డెన్‌లో తిరగడానికి వెళ్లాడు” అని జోక్ చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

అయితే రిషభ్ పంత్‌.. గార్డెన్‌ కామెంట్ చేయడంపై ఓ స్టోరీ ఉంది. గతంలో ఓ టెస్టు మ్యాచ్ సందర్భంగా.. టీమ్‌లోని ఆటగాళ్లు సీరియస్‌గా ఆడకపోవడంతో రోహిత్ శర్మ.. గార్డెన్‌లో తిరగడానికి వచ్చారా? అని ఫైర్ అయ్యాడు. దీంతో ఈ డైలాగ్ ఫేమస్ అయిపోయింది. రోహిత్ లేకున్నా ఈ గార్డెన్ డైలాగ్ గుర్తొస్తుందా అని ఫ్యాన్స్ పంత్‌ను అడగ్గా.. ఎందుకు గుర్తుకు రాదంటూ అతడు బదులిచ్చాడు. భారత్‌-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జూన్ 20న ప్రారంభం కానుంది.

ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్

తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టు:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్

2025-06-06T12:13:58Z