మా నితేష్‌ బంగారం.. పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో గోల్డ్‌ మెడల్‌

పారిస్‌ 2024 పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే పారిస్‌ ఒలింపిక్స్‌లో సాధించిన పతకాల కంటే ఎక్కువ సంఖ్యలో మెడల్స్‌ కొల్లగొట్టిన పారా అథ్లెట్లు.. వడివడిగా లక్ష్యం దిశగా సాగుతున్నారు. సోమవారం భారత్‌ ఖాతాలో రెండో గోల్డ్‌ మెడల్‌ చేరింది. 29 ఏళ్ల భారత షట్లర్‌ నితేష్‌ కుమార్‌.. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌ 3 ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్‌లో బ్రిటన్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు డేనియల్‌ బెథెల్‌పై 21-14, 18-21, 23-21 తేడాతో నితేష్ కుమార్‌ విజయం సాధించాడు. దీంతో భారత్‌ ఖాతాలో రెండో గోల్డ్‌ మెడల్‌ను అందించాడు.

ఫైనల్‌లో బెథెల్‌ నుంచి నితేష్‌ కుమార్‌కు గట్టి పోటీ ఎదురైంది. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన ఈ బ్రిటన్‌ ప్లేయర్‌.. టఫ్‌ ఫైట్‌ ఇచ్చాడు. తొలి గేమ్‌లో నితేష్‌ కుమార్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో గేమ్‌ మాత్రం హోరాహోరీగా సాగింది. ఓ దశలో 11-8తో ఆధిక్యంలో నిలిచాడు నితేష్‌. కానీ టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన డేనియల్‌.. తనలోని అసలైన ప్రదర్శన బయటకు తీశాడు. దీంతో వరుసగా పాయింట్లు సాధించి.. రెండో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. చివరి గేమ్‌లోనూ గట్టిపోటీ ఎదురైనా.. జితేష్‌ మాత్రం గెలుపుగీతను దాటాడు. వరుసగా రెండో పారాలింపిక్స్‌లో డేనియల్‌ను రజతానికే పరిమితం చేశాడు.

ఇక పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌ 25 పతకాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. నితేష్ కుమార్‌ సాధించిన స్వర్ణంతో కలిపి ఇప్పటివరకు 9 పతకాలు సాధించింది. ఇందులో రెండు స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. మరోవైపు మరో ఈవెంట్‌లోను భారత్‌ పతకం ఖరారు చేసుకుంది. బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌4లో సుహాస్‌ యతిరాజ్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరాడు.

టోక్యో 2020 పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన సుహాస్‌.. ఈ సారి మాత్రం స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. సోమవారం రాత్రి 9.40 గంటలకు ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్‌తో అతడు తలపడనున్నాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-02T12:44:23Z dg43tfdfdgfd