న్యూఢిల్లీ: ఒలింపిక్స్.. ప్రపంచ దేశాలన్నీ ఒక్క చోట చేరే అద్భుతమైన క్రీడా సంగ్రామం! విశ్వక్రీడలకు కనీసం ఒక్కసారైనా ఆతిథ్యమివ్వాలని ఆశించే దేశాలు కోకొల్లలు. అందుకు భారత్ అతీతం కాదు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. కానీ మన ముందరి కాళ్లకు బంధం పడుతున్నది. ఆతిథ్యమిచ్చేందుకు అన్ని రకాల వనరులున్నా.. కొన్ని కారణాలు మనల్ని వెనుకకు నెట్టివేస్తున్నాయి. ముఖ్యంగా భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ)లో అంతర్గత విబేధాలు.. డోపింగ్ జాఢ్యం అథ్లెట్లను నీడలా వెంటాడుతుండగా ఒలింపిక్స్‌లో మన ప్రదర్శన నానాటికీ తీసికట్టు అన్నట్లు తయారవుతున్నది.
ముఖ్యంగా ఈ మూడు కారణాలు భారత్.. ఒలింపిక్ ఆతిథ్య ఆశలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లోని లాసానెలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) సమావేశాల్లో ఐవోఏ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలిసింది. 2036 ఒలింపిక్స్‌కు అహ్మదాబాద్‌ను ప్రధాన నగరంగా పేర్కొన్న భారత్ తరఫున ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు గుజరాత్ క్రీడాశాఖ మంత్రి హర్ష్ సంగ్వీ, క్రీడా, ఐవోఏ ఉన్నతాధికారులు ఈ కీలక భేటీలో పాల్గొన్నారు.
ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్‌కు ఉన్న అవకాశాలను ఐవోసీకి వివరించారు. అయితే ఐవోఏ ప్రయత్నాలపై ఐవోసీ ఒక రకంగా నీళ్లు చల్లినట్లు తెలిసింది. ముఖ్యంగా ఐవోఏలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు వెంటనే ముగింపు పలుకాలని స్పష్టం చేసింది. అధ్యక్షురాలు, పాలకవర్గ సభ్యులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఐవోఏ కొనసాగుతున్నది. ఈ కారణంగా ఒలింపిక్ అభివృద్ధి నిధులను ఆపేసిన ఐవోసీ వీటికి ఫుల్‌స్టాప్ పెడితేనే తమ నుంచి ఆర్థిక మద్దతు ఉంటుందని పేర్కొంది. దీనికి తోడు డోపింగ్ భూతం దయ్యంలా వేధిస్తున్నది. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా..అథ్లెట్లు డోపింగ్‌లో పట్టుబడుతూనే ఉన్నారు.
డోపింగ్ నియంత్రణలో ఐవోఏ తీసుకుంటున్న చర్యలపై ఐవోసీ తీవ్ర అసంతృప్తితో ఉంది. మరీ ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో డోపింగ్ కేసుల విషయంలో కెన్యా తర్వాత భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశం పతకాల సాధనలో ముందుండాలని ఐవోసీ తెలిపింది. పారిస్ ఒలింపిక్స్‌లో 6 పతకాలతో 71వ స్థానంలో నిలిచిన భారత్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరాన్ని ఐవోసీ నొక్కి చెప్పింది. ఇన్ని కారణాల మధ్య విశ్వక్రీడల నిర్వహణ కలను భారత్ సాకారం చేసుకుంటుందా అన్నది ప్రశ్నగానే మిగిలింది.
2025-07-04T21:25:46Z