బెంగళూరు తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన గవాస్కర్.. ఆర్సీబీ అప్పుడే అలా చేసుంటే..!

Bengaluru Stampede: ఐపీఎల్ 2025 టైటిల్ సాధించడం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఆర్సీబీ.. ఆరు రన్స్ తేడాతో గెలుపొందింది. దీంతో తొలిసారి ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్ దేశ వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే టైటిల్ సాధించిన రాత్రే.. దేశంలోని చాలా నగరాల్లో రోడ్లపైకి వచ్చే విజయోత్సవాలు నిర్వహించారు. టైటిల్ విజయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ అభిమానులతో సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే బెంగళూరులో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయింది.

కానీ ఊహించని విధంగా ఫ్యాన్స్ తరలిరావడంతో బెంగళూరుతో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఆర్సీబీ సంబరాలు విషాదాన్ని నింపాయి. అయితే ఆర్సీబీ టైటిల్ సాధించాక సంబురాలు, 11 మంది చనిపోవడంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తొలిసారి స్పందించారు.

తొక్కిసలాట జరగడానికి గల కారణాలను సైతం విశ్లేషించారు. ఐపీఎల్ ప్రారంభమైన కొన్నాళ్లకే ఆర్సీబీ టైటిల్ సాధించి ఉంటే.. అభిమానుల్లో ఇంత తీవ్రస్థాయిలో భావోద్వేగాలు ఉండేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

''ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లోనే ఆర్సీబీ టైటిల్‌ సాధించి ఉంటే.. ఇప్పుడు ఉన్నంత తీవ్రస్థాయిలో ఫ్యాన్స్‌లో భావోద్వేగాలు ఉండేవి కాదు. ఐపీఎల్‌లో ఇతర జట్లు కూడా టైటిల్స్ సాధించాయి. కానీ ఆ జట్ల విజయోత్సవాలు ఈ రేంజ్‌లో లేవు. ఎందుకంటే ఆయా టీమ్‌ల అభిమానులు టైటిల్ కోసం పెద్దగా నిరీక్షించలేదు. కానీ ఆర్సీబీ పరిస్థితి భిన్నం. 'ఈసాలా కప్ నమదే' నినాదం విన్న వెంటనే ఆర్సీబీ గుర్తొస్తోంది. ఈసారి మాత్రం ఆ జట్టు అద్భుతంగా ఆడి టైటిల్ సాధించింది. ఇక తమ అభిమాన జట్టుకు బెంగళూరులో అద్భుతమైన రీతిలో స్వాగతం పలకాలని ఫ్యాన్స్‌ కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ తొక్కిసలాటలో అభిమానులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. ఇది విషాదకర ఘటన'' అని గవాస్కర్ చెప్పుకొచ్చారు.

కాగా ఆర్సీబీ 2009, 2011, 2016 ఐపీఎల్‌ ఫైనల్స్‌లో ఓడిపోయింది. 9 ఏళ్ల తర్వాత 2025లో ఫైనల్ చేరి.. తొలి టైటిల్‌ను ముద్దాడింది.

2025-06-09T14:41:19Z