Bengaluru Cricket Matches Shifted To Rajkot : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట విషాదంగా మారింది. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంతోషంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో బెంగళూరులో మ్యాచ్‌ల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా నవంబర్ 13 నుంచి 19 వరకు జరగాల్సిన ఇండియా 'ఏ', సౌత్ ఆఫ్రికా 'ఏ' మధ్య వన్డే సిరీస్ మ్యాచ్‌లను రాజ్‌కోట్‌కు తరలించింది బీసీసీఐ.
జూన్ 4న రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ నిర్వహిస్తున్న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట బెంగళూరులో క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అసోషియేషన్ నిర్వహణ సామర్థ్యాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని కారణంగా ఇండియా 'ఏ', సౌత్ ఆఫ్రికా 'ఏ' మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బీసీసీఐ రద్దు చేసింది. ఈ మ్యాచ్‌లు నవంబర్ 13 నుంచి 19 వరకు జరగాల్సి ఉండగా వీటిని రాజ్‌కోట్‌కు తరలిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
అయితే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌ల వేదిక మార్పునకు మార్పునకు తొక్కిసలాట కారణం కాదని కేఎస్సీఏ అధ్యక్షుడు చెబుతునప్పటికీ.. రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్‌కు జరగాల్సిన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వేదిక మార్పుపై గురువారం ఈ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. కేఎస్సీఏకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెడ్-బాల్ మ్యాచ్‌లు మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను బెంగళూరు శివారులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించనున్నారు.
తొక్కిసలాట ఘటనకు తోడు చిన్నస్వామి స్టేడియంలో ప్రహరీ గోడలు, రైలింగ్‌లు, మెట్లు, టాయిలెట్లు వంటివి పాడయ్యాయి. వాటిని బాగు చేయాల్సి ఉంది. జూన్ 4న అభిమానుల తాకిడికి స్టేడియం చాలా వరకు దెబ్బతింది. ఈ కారణాల వల్ల కేఎస్సీఏకు మరికొంత కాలం మ్యాచ్‌ల నిర్వహణ కష్టంగా మారే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దితేనే అసోసియేషన్‌కు మళ్లీ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం వస్తుంది. లేదంటే బెంగళూరు క్రికెట్ అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ఈ విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి స్పందించారు. "50 ఏళ్లుగా అభిమానులకు ఆనందాన్ని పంచిన స్టేడియంలో జరిగిన విషాదం నన్ను కలచివేసింది. మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లు బెంగళూరు నుంచి తరలిస్తే, అది రాష్ట్ర క్రికెట్‌కు పెద్ద దెబ్బ. మహిళల క్రికెట్ గత రెండున్నర సంవత్సరాలుగా పెద్దగా పురోగతి చెందలేదు. ఈ ఘటన మహిళల క్రికెట్‌ను మరింత వెనక్కి నెట్టేస్తుంది." అని రంగస్వామి చెప్పుకొచ్చారు.
2025-06-10T06:13:44Z