బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన జడేజా.. చర్యలు తప్పవా!

భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. బీసీసీఐ ప్రొటోకాల్‌ను బ్రేక్ చేశాడా? బీసీసీఐ ఇటీవల ప్రవేశపెట్టిన రూల్స్‌ను అతిక్రమించాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతడు రూల్స్ అతిక్రమించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆటగాళ్లంతా మైదానానికి వచ్చినా.. ఆ తర్వాత హోటల్‌కు వెళ్లినా ఒకేసారి కలిసి వెళ్లాలి. కానీ జడ్డూ.. ఒంటరిగా మైదానానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు రవీంద్ర జడేజా టీమ్‌లోని సభ్యుల కంటే ముందే హోటల్‌ నుంచి ఎడ్జ్‌బాస్టన్ స్టేడియానికి వెళ్లాడట. అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి జడ్డూ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందే.. ఎక్కువగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు అతడు స్టేడియానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మేనేజ్‌మెంట్‌కు ముందుగానే సమాచారం ఇచ్చాడట.

నిజానికి బీసీసీఐ ఇటీవల పది కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ రూల్స్ ప్రకారం భారత ఆటగాళ్లు మైదానానికి వెళ్లేటప్పుడు, తిరిగి హోటల్‌కు వచ్చేటప్పుడు కలిసే రావాలి. ఒకే బస్సులో ప్రయాణించాలి. ఆటగాళ్ల మధ్య సాన్నిహిత్యం పెరగాలని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ ఆటగాడు కూడా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది.

కానీ రెండో రోజు ఆటలో మెరుగ్గా బ్యాటింగ్ చేయాలనే ఉద్దేశంతో జడేజా, అందరి కన్నా ముందే వచ్చి నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బౌన్సర్లను ఎదుర్కొన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం జడ్డూ ఈ నిర్ణయం తీసుకున్నందున.. క్రమ శిక్షణ తప్పినట్లు కాదనే వాదన ఉంది. మేనేజ్‌మెంట్‌కు కూడా ముందే చెప్పడంతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు.

ఇక ఈ మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు. కెప్టెన్ గిల్‌తో కలిసి.. రెండొందలకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయి.. సెంచరీ మిస్ చేసుకున్నాడు.

2025-07-05T09:07:49Z