ఫైనల్‌లో ఆ ఒక్క క్యాచ్ టర్నింగ్ పాయింట్.. టీమిండియా ఓటమికి కారణం!

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా పోరాటం ముగిసింది. టైటిల్ దక్కాలంటే గెలవాల్సిన మ్యాచులో భారత్ ఓటమి పాలైంది. ఫలితంగా సొంతగడ్డపై మరోసారి కప్పు గెలవాలన్న కల.. కలలాగే మిగిలిపోయింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో సెమీస్ నుంచే ఇంటి బాట పట్టిన భారత్.. ఈ సారి అజేయంగా ఫైనల్ వరకు చేరింది. దీంతో ఈ సారి ఎలాగైనా కప్పుగెలుస్తుందని అంతా భావించారు.

ఫైనల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ టోర్నీలో భారత్ బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉండటం.. గత మ్యాచుల్లోనూ రాణించడంతో భారత్ 350 పైచిలుకు లక్ష్యాన్ని నిలిపి.. ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే.. ఈ టోర్నీలో మెరుపు ఆరంభం ఇస్తున్న రోహిత్ శర్మ.. ఈ మ్యాచులోనూ అదే జోరు కొనసాగించాడు. వచ్చీ రాగానే బాదడం మొదలెట్టాడు.

రోహిత్ జోరుకు భారత్ 4 ఓవర్లలో 30/0తో నిలిచింది. అనంతరం గిల్ ఔట్ అయినా.. రోహిత్ జోరు కొనసాగించాడు. విరాట్ కోహ్లీతో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ 8 ఓవర్లలో 61/1తో నిలిచింది. మిగతా బ్యాటర్లంతా ఫామ్‌లో ఉండటంతో.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం నిలిపేలా కనిపించింది భారత్. కానీ పదో ఓవర్‌లో నాలుగో బంతికి రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. అంతకుముందు వరుసగా 6, 4 కోట్టిన రోహిత్.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్‌లో.. బంతి సరిగ్గా కనెక్ట్ కాలేదు.

రోహిత్ శర్మ కొట్టిన బంతి గాల్లోకి లేచింది. కానీ ఫీల్డర్లు లేని చోట బంతి పడేలా కనిపించింది. ఈ సమయంలోనే ట్రావిస్ హెడ్ అద్భుతం చేశాడు. కవర్స్ నుంచి వెనక్కి సుమారు 11 మీటర్లు పరిగెడుతూ.. అద్భుతంగా డైవ్ చేసి.. క్యాచ్‌ను ఓడిసిపట్టాడు. ఇక అంతే అప్పటి నుంచి భారత్ సీన్ రివర్స్ అయింది. రోహిత్ జోరుతో పది ఓవర్లకు 80/2తో నిలిచినా.. తర్వాత తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది టీమిండియా.

రోహిత్ శర్మ ఉన్నంత సేపు కనీసం ఓవర్‌కు ఒక బంతినైనా బౌండరీకి తరలించాడు. కానీ అతడు ఔట్ అయిన తర్వాత ఓ దశలో 97 బంతుల వరకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఇక్కడే భారత్ వెనకబడి పోయింది. రోహిత్ క్యాచ్ అందుకున్న ట్రావిస్ హెడ్.. మ్యాచును మలుపు తిప్పాడు. అనంతరం బ్యాటింగ్‌లోనూ సెంచరీతో చెలరేగి జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు.

2023-11-20T04:43:18Z dg43tfdfdgfd