ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2023-25) ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ మూడో ఫైనల్ జరిగే వేదిక, తేదీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానాన్ని ఇందుకు వేదికగా వెల్లడించింది. జూన్ 11 నుంచి 15వ తేదీల్లో ఈ పోరు జరగనున్నట్లు తెలిపింది. జూన్ 16 రిజర్వ్ డేగా ఉంటుందని చెప్పింది. కాగా ప్రపంచ క్రికెట్‌లో ప్రఖ్యాత స్టేడియంగా పేరు పొందిన లార్డ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఆదర తగ్గిపోతున్న టెస్టు మ్యాచ్‌లపై ప్రేక్షకులకు ఆసక్తి పెంచాలనే లక్ష్యంతో ఐసీసీ.. 2019లో డబ్ల్యూటీసీ టోర్నీని ప్రారంభించింది. రెండేళ్ల పాటు ఒక్కో ఎడిషన్ ఉండేలా షెడ్యూల్ రూపొందించింది. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. తొలి ఎడిషన్ డబ్ల్యూటీసీ 2019-2021లో జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా జరిగింది. భారత్- న్యూజిలాండ్ జట్లు ఈ పోటీలో తలపడ్డాయి. భారత్‌ను ఓడించి న్యూజిలాండ్ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ గదను సొంతం చేసుకుంది.
2021-2023 ఎడిషన్‌లోనూ భారత్ ఫైనల్ చేరింది. ఓవర్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఇందులోనూ భారత్ పరాజయం పాలైంది. ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. దీంతో భారత్ రెండుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2023-2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఎడిషన్‌లోనూ భారత్ ఫైనల్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది.
మరో రెండున్నర నెలల్లో ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌తో మూడో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడే జట్లేవే ఖరారు కానున్నాయి! ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడో ప్లేసులో ఉంది. పాకిస్థాన్ గడ్డపై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. నాలుగో స్థానానికి చేరింది.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత్ మరో రెండు సిరీస్‌లు కూడా ఆడనుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఆ తర్వాత స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల తర్వాత ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు పర్యాయాలు భారత్ 2-1తో సిరీస్ దక్కించుకుంది. ఈ సారి కూడా అదే పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-09-03T17:29:52Z dg43tfdfdgfd