టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. 2006లో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన చావ్లా 2077 టీ20 వరల్డ్‌కప్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2011 గెలిచిన టీమిండియా జట్టులో కీలక ఆటగాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడు. దాదాపు 20 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగిన పీయూష్ చావ్లా 36 సంవత్సరాల వయస్సులో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
"రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ఫీల్డ్‌లో కొనసాగే, ఇక ఈ అందమైన ఆటకి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. క్రీజు నుంచి బయటకు వచ్చినా కూడా.. క్రికెట్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నేను ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను, క్రికెట్‌లో నేర్చుకున్న అనుభవాలు, గుణపాఠాలు నాకు ఉపయోగపడతాయి. ఈ రోజు నాకు చాలా ఎమోషనల్ డే.. ఎందుకంటే నేను అన్ని అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను" అని ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక పోస్ట్ చేశాడు.
ధోనీ కెప్టెన్సీలో టీమిండియాకు వచ్చిన రెండు వరల్డ్‌కప్‌లలోనూ పీయూష్ చావ్లా కీలక ఆటగాడిగా వ్యవహరించాడు. టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్‌కప్ 2011లో చావ్లా ఆడాడు. టీమిండియా తరఫున మొత్తం మూడు టెస్టులు, 25 వన్డేలు, ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 43 వికెట్లు తీసుకున్నాడు.
"2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం నా కెరీర్‌లో అత్యున్నతమైనది. ఆ రోజులు ఎప్పుడూ నా మదిలోనే మెదులుతూ ఉంటాయి. ఇవాళ నేను ఈ రోజు ఇలా ఉన్నానంటూ దానికి ముఖ్య కారణం మా నాన్న గారే. ఆయన లేకుండా నాకిది సాధ్యమయ్యేదే కాదు" అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
ఐపీఎల్ 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంలో చావ్లా పాత్ర చాలా కీలకం. బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ చావ్లా చేసిన పరుగులు కేకేఆర్‌ని విజేతగా నిలిపాయి. 192 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన చావ్లా 4/17 బెస్ట్‌తో 192 వికెట్లు పడగొట్టాడు. పీయూష్ చావ్లా చివరగా ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2024లో ఆడాడు. 17 సంవత్సరాల వయస్సులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన చావ్లా ఓవరాల్‌గా వెయ్యి వికెట్లు పైగా పడగొట్టాడు. రిటైర్మెంట్ సందర్భంగా తన గురువులు గౌతమ్, పంకజ్ సరస్వత్‌ను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ కామెంటేటర్‌గా హాట్ స్టార్‌తో కలిసి పనిచేస్తున్నాడు.
2025-06-06T11:13:46Z