పాపం పాకిస్థాన్‌.. బంగ్లాదేశ్ దెబ్బతో ICC ర్యాంకింగ్స్‌లో అట్టడుగుకు, బాబర్ అజామ్ ఐదేళ్లలో తొలిసారి ఇలా..!

పాకిస్థాన్ క్రికెట్ తిరోగమనం దిశగా సాగుతోంది. గత కొంత కాలంగా ఆ జట్టు ఆటతీరు మరీ తీసికట్టుగా తయారవుతోంది. వన్డే వరల్డ్ కప్- 2023, తర్వాత టీ-20 వరల్డ్ కప్‌లోనూ చిన్న జట్ల చేతుల్లో ఓడి.. గ్రూప్ దశలోనే నిష్ర్కమించాల్సి వచ్చింది. ఆ తర్వాత తాజాగా స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్ వైట్ వాష్‌కు గురైంది. టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు తగిలాయి. 2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. మరోవైపు 2-0 తో టెస్ట్ సిరీస్ గెల్చిన బంగ్లాదేశ్.. నాలుగో స్థానానికి చేరింది. ఇక వెస్టిండీస్ ఒక్కటే పాకిస్థాన్ కంటే దిగువన ఉండటం గమనార్హం.

డబ్ల్యూటీసీలో కిందికి పడిపోయిన పాక్‌కు.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ భంగపాటే ఎదురైంది. ఇక్కడ కూడా పాక్ జట్టు.. 8వ స్థానానికి దిగజారింది. ‘పాకిస్థాన్ టీమ్.. రెండు స్థానాల్ని కోల్పోయి, ఐసీసీ మెన్స్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోయింది. స్వదేశంలో సిరీస్ ఓటమి నేపథ్యంలో పాక్ పాయింట్స్ తగ్గాయి. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు పాకిస్థాన్ ఆరో ప్లేస్‌లో ఉండేది. వరుసగా 2 మ్యాచ్‌ల్లో ఓటమితో కిందికి పడిపోయింది’ అని ఒక ప్రకటనలో వెల్లడించింది ఐసీసీ.

ఇప్పుడు పాక్ జట్టు 76 పాయింట్లతో 8వ ర్యాంకులో ఉంది. ఆస్ట్రేలియా (124 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఇండియా (120), ఇంగ్లాండ్ (108) వరుసగా ఉన్నాయి.

మరోవైపు ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్ 3 స్థానాలు దిగజారాడు. గత కొంత కాలంగా దారుణంగా విఫలం అవుతున్న అజమ్.. ఐదేళ్ల తర్వాత తొలిసారి టాప్-10 నుంచి బయటికి వచ్చాడు. ప్రస్తుతం 12వ స్థానంలో నిలిచాడు. వన్డే వరల్డ్ కప్, టీ-20 వరల్డ్ కప్‌లో జట్టును ప్లేఆఫ్స్ చేర్చలేకపోయిన బాబర్.. ఇప్పుడు బంగ్లాతో టెస్టు సిరీస్‌లోనూ తేలిపోయాడు. 2 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 64 రన్స్ మాత్రమే చేశాడు.

చివరిసారిగా 2019 డిసెంబర్ నెలలో బాబర్ 13వ ర్యాంకులో ఉండగా.. ఆ తర్వాత ఐదేళ్లుగా టాప్-10లోనే స్థానం నిలుపుకున్నాడు. ఒక దశలో రెండో స్థానానికి కూడా చేరాడు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు రోహిత్, యశస్వి జైశ్వాల్, విరాట్ వరుసగా 6, 7, 8 స్థానాల్లోనే ఉన్నారు. జో రూట్ టాప్‌లో ఉన్నాడు.

డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ లార్డ్స్‌లో జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఈ టేబుల్‌లో టీమిండియా 68.52 విజయశాతంతో అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ (62.50) రెండో ప్లేస్‌లో ఉంది. న్యూజిలాండ్ మూడో స్థానంలో, బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ఐదో ప్లేస్‌లో ఉంది. పాకిస్థాన్ 8, వెస్టిండీస్ 9వ స్థానాల్లో ఉన్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-04T17:00:13Z dg43tfdfdgfd