పనైపోయిందనుకున్నారా.. పృథ్వీ షా ఈజ్ బ్యాక్.. 200లకు పైగా స్ట్రైక్‌ రేట్‌తో బ్యాటింగ్

అండర్ 19 క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ముంబై క్రికెటర్ పృథ్వీ షా.. ఆ తర్వాత కనుమరుగై పోయాడు. ఎంతవేగంగా పేరు సంపాదించాడో.. అదే వేగంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. ఫామ్‌లేమి, ఫిట్‌నెస్ సమస్యలతో కొన్ని రోజులుగా మైదానానికి దూరమయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోనైతే అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించలేదు. అతడి కెరీర్‌లో ఇదొక పెద్ద కుదుపు లాంటిదే. అతడి పనైపోయిందని అంతా భావించారు. అలాంటి తరుణంలో ముంబై టీ20 లీగ్‌లో పృథ్వీ షా అదరగొట్టాడు.

పృథ్వీ షా ఈ లీగ్‌లో నార్త్‌ ముంబై పాంథర్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ట్రయంప్‌ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. 34 బంతుల్లో ఏకంగా 75 పరుగులు స్కోరు చేశాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా అతడు 12 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. మళ్లీ టీ20 క్రికెట్ ఆడేందుకు తాను సిద్ధమన్నట్లు సంకేతాలు ఇచ్చాడు.

తాజా ప్రదర్శనతో పృథ్వీ షా మళ్లీ చర్చల్లోకి వచ్చాడు. ఇదే ప్రదర్శన కంటిన్యూ చేసి.. ముంబై దేశవాళీ జట్టులో చోటు సంపాదించాలని లక్ష్యంతో ఉన్నాడు. కొన్నేళ్లుగా ముంబై క్రికెట్‌ జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన అతడు.. 2024-25 సీజన్‌లో మాత్రం కొన్ని మ్యాచ్‌లకు జట్టులో చోటు కోల్పోయాడు. విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఇక మళ్లీ ఫామ్ అందుకుని.. ముంబై జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ కూడా రాణిస్తే.. ఐపీఎల్ 2026తో పాటు జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకోవచ్చేమో!

2018లో టీమిండియా తరఫున పృథ్వీ షా డెబ్యూ చేశాడు. తొలి టెస్టులోనే సెంచరీ బాదాడు. అయితే ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఫిట్‌నెస్‌ సమస్యలు, వ్యక్తిగత ప్రవర్తన కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. అతడు చివరగా 2021లో టీమిండియా తరఫున మ్యాచ్ ఆడాడు.

ఇక ముంబై టీ20 లీగ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్‌ ముంబై పాంథర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం ట్రయంప్‌ నైట్స్‌ 19.5 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటై 38 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

2025-06-09T17:11:39Z