దీప్తి జీవాంజీ: కోతిలా ఉన్నావ్ అన్నవాళ్లే.. మెచ్చుకుంటున్నారు.. స్ఫూర్తిదాయకం ఈ వరంగల్ అథ్లెట్ ప్రస్థానం!

Deepthi Jeevanji Paris Paralympics: పారిస్ 2024 పారాలింపిక్స్‌లో తెలంగాణ బిడ్డ 20 ఏళ్ల దీప్తి జీవాంజీ కాంస్య పతకం సాధించింది. విమెన్స్ 400 మీటర్ల T20 విభాగం ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఈ ఫీట్ సాధించింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు మార్మోగిపోయింది. దీంతో దీప్తి జీవాంజీ ఎవరు? అని తెలుసుకునేందుకు క్రీడాభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఎవరు దీప్తి జీవాంజీ? ఆమె నేపథ్యం ఏంటి? వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కల్లెడ గ్రామంలోని యాదగిరి- ధనలక్ష్మి దంపతులకు దీప్తి జీవాంజీ జన్మించింది. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు. కూలీకి వెళ్తేగానీ ఆరోజు పూట గడవని పరిస్థితి. అయితే తల్లిదండ్రులకు మేనరిక వివాహం. వీరిద్దరికీ జన్మించిన దీప్తి గ్రహణం మొర్రితో పుట్టింది. ఆపరేషన్ తర్వాత కూడా ఆమె ముఖంపై ఛాయలు కనిపించేవి. దీనికి తోడు ఆమె మానసిక ఎదుగుదల సమస్యలు, అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. చిన్నప్పటి నుంచి ఐక్యూ (ఇంటలిజెన్స్ కోషియంట్) అనే సమస్యతో బాధ పడుతోంది.

గ్రహణం మొర్రి కారణంగా ఆమె ముఖంలో మార్పులు ఏర్పడ్డాయి. దీంతో ఆమెను చాలా మంది కోతి పిల్ల, కోతి ముఖం అని ఎగతాళి చేసే వారని.. ఆమె తల్లి ధనలక్ష్మి తెలిపారు. కానీ తనను ఏడిపించిన వారి దగ్గరకు దీప్తి తన తండ్రిని తీసుకెళ్లి పంచాయతీ పెట్టేదని పేర్కొన్నారు.

టర్నింగ్ పాయింట్..

దీప్తికి పాఠశాల రోజుల నుంచి చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఆటల్లో మాత్రం మెరుగ్గా రాణించేది. కల్లెడలోని ఆర్డీఎఫ్ పాఠశాలలో గణతంత్ర దినోత్సం సందర్భంగా పరుగు పోటీలు నిర్వహించారు. ఇందులో దీప్తి ప్రతిభ చాటి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో పాఠశాల పీఈటీ ఆమె ప్రతిభను గుర్తించి జిల్లా స్థాయి పోటీలకు తీసుకొచ్చారు. హనుమకొండ జేఎన్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలను అంతర్జాతీయ అథ్లెటిక్స్ కోచ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత నాగపురి రమేశ్ వీక్షించారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాలని సూచించారు.

బూట్లు లేకుండానే రాష్ట్రస్థాయి పోటీలకు..

కానీ దినసరి కూలీలు అయిన తల్లిదండ్రులు ఆమెకు కనీసం బూట్లు కూడా కొనిచ్చే స్థితిలో లేరు. దీంతో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఆమె బూట్లు లేకుండానే వెళ్లారు. అంతర్జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌తో పాటు కల్లెడ ఆర్డీఎఫ్ నిర్వాహకులు ఆమెకు అప్పట్లోనే నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత పుల్లెల గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్న దీప్తి.. అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తాచాటింది. తాజాగా పారిస్ పారాలింపిక్స్‌లో.. బ్రాంజ్ మెడల్ సాధించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-04T09:30:15Z dg43tfdfdgfd