ఛత్తీస్‌గడ్ ఎక్స్‌ప్రెస్‌లో విషాద ఘటన జరిగింది. రన్నింగ్ ట్రైన్‌లో ఓ దివ్యాంగ క్రికెటర్ ఛాతీ నొప్పి కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌కు చెందిన 38 ఏళ్ల దివ్యాంగ క్రికెటర్ విక్రమ్ సింగ్ వీల్‌ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ కోసం ఢిల్లీ నుంచి గ్వాలియర్‌కు ప్రయాణిస్తుండగా ఇది జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణం చేస్తుండగా ఉన్నట్లుండి విక్రమ్ సింగ్.. ఆరోగ్యం క్షీణించింది. అయితే ఈ సమయంలో ఎమర్జెన్సీ సేవల కోసం పదే పదే ఫోన్ కాల్స్ చేసినా.. వైద్య సహాయం సకాలంలో అందలేదని సహచర క్రికెటర్లు తెలిపారు. దీంతో రైలు తర్వాతి స్టేషన్ అయిన మధుర స్టేషన్‌కు చేరుకునే లోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
విక్రమ్ సింగ్, అతడి సహచర క్రికెటర్లు.. వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు బుధవారం రాత్రి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. బయలుదేరిన కొద్దిసేపటికే విక్రమ్ సింగ్.. తీవ్రమైన ఛాతీ నొప్పికి గురయ్యాడు. దీంతో అత్యవసర వైద్య సహాయం కోరుతూ ఉదయం 5 గంటల సమయంలో రైల్వే హెల్ప్‌లైన్‌కు కాల్ చేసినట్లు అతడి సహచరులు చెప్పారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. రెస్పాన్స్ రాలేదని పేర్కొన్నారు. రైలు దాదాపు 90 నిమిషాలు ఆలస్యంగా అంటే ఉదయం 8:10 గంటలకు మధుర స్టేషన్‌కు చేరుకుంది. అయితే అప్పటికే అతడు మరణించాడు.
మధుర జంక్షన్ చేరిన తర్వాత రైల్వే పోలీసులు.. విక్రమ్ సింగ్ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక రైల్వే అధికారులు సరైన సమయానికి స్పందించలేదనిే ఆరోపణలపై రైల్వే పోలీసులు.. అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
2025-06-06T18:14:52Z