డబ్ల్యూపీఎల్ 2023లో ఎట్టకేలకి బెంగళూరు బోణి.. ప్లేఆఫ్ ఆశలు సజీవం!

Women's Premier League 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) టీమ్‌ ఎట్టకేలకి బోణి కొట్టింది. సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఆర్సీబీ టీమ్ బుధవారం రాత్రి యూపీ వారియర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూపీ టీమ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకి ఆలౌటవగా.. ఆర్సీబీ టీమ్ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. దాంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానం నుంచి నాలుగో స్థానానికి బెంగళూరు ఎగబాకింది. ఐదో మ్యాచ్ ఆడిన యూపీకి ఇది మూడో ఓటమి.

136 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు టీమ్ ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ స్మృతి మంధాన (0) డకౌట్‌గా వెనుదిరగగా.. సోఫియా డివైన్ (14), పెర్రీ (10), తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ.. కన్నిక ఆహుజా (46: 30 బంతుల్లో 8x4, 1x6) దూకుడుగా ఆడేసింది. ఆమెకి హీథర్ నైట్ (24: 21 బంతుల్లో 5x4), రిఛా ఘోస్ (31 నాటౌట్: 32 బంతుల్లో 3x4, 1x6) చక్కటి సహకారం అందించారు. అలానే చివర్లో శ్రేయాంక పాటిల్ (5 నాటౌట్) సమయోచితంగా ఆడింది. దాంతో బెంగళూరు గెలుపు రుచి చూడగలిగింది.

యూపీ వారియర్స్ జట్టులో గ్రేస్ హారిస్ (46: 32 బంతుల్లో 5x4, 2x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి బెంగళూరు బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ యూపీపై ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యారు. బెంగళూరు బౌలర్లలో ఎల్సీ పెర్రీ మూడు, ఆశా శోభన, సోఫీ డివైన్ చెరో రెండు వికెట్లు తీశారు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

2023-03-15T17:43:51Z dg43tfdfdgfd