ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌కు చేరుకుంది. శుభమన్ గిల్ కెప్టెన్సీలోని భారత బృందం శుక్రవారం ముంబై నుంచి ఇంగ్లండ్ బయల్దేరింది. నిన్న లండన్ చేరుకున్న టీమిండియా ఇవాళ లార్డ్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు గ్రౌండ్‌లో వర్కవుట్స్ స్టార్ట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ నెల 20 నుంచి ఇంగ్లండ్ - ఇండియా మధ్య టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ జరగనుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లోనే పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 కూడా ఈ సిరీస్‌తోనే ప్రారంభం కానుండటంతో ఆసక్తికరంగా మారనుంది.
ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ వచ్చీరాగానే లార్డ్స్‌లో కసరత్తులు ప్రారంభించింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లోని ఇండోర్ స్టేడియంలో వర్కవుట్స్ మొదలు పెట్టారు. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆధ్వర్యంలో ప్లేయర్లందరూ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. రనౌట్స్, త్రో, క్యాచ్‌లు, రన్నింగ్ ప్రాక్టీస్ చేశారు.
ఇప్పటికే భారత ఏ జట్టు లండన్ లయన్స్‌తో అనధికార టెస్టు మ్యాచ్‌లు ఆడుతోంది. మొదటి మ్యాచ్ డ్రా కాగా.. రెండో మ్యాచ్ ఇప్పుడు కొనసాగుతోంది. మొదటి టెస్టులో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ చేస్తే, రెండో టెస్టులో కేఎల్ రాహుల్ శతకం బాదాడు. లండన్ లయన్స్‌తో మ్యాచ్‌లు అనంతరం భారత్, భారత్ ఏ మధ్య మరో మ్యాచ్ జరగనుంది.