కంకషన్‌పై వివాదం: ఇది అన్యాయం.. మేం గెలిచేవాళ్లం - ఇంగ్లాండ్ కెప్టెన్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. శుక్రవారం పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20లో 15 రన్స్ తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 3-1తో ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 రన్స్ చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 166 రన్స్‌కి ఆలౌట్ చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు తీసుకున్న నిర్ణయంపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ చేస్తుండగా భారత బ్యాటర్ శివమ్ దూబె తలకు బలమైన గాయం కావడంతో కంకషన్‌కు గురి కాగా.. అతడి ప్లేసులో హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చాడు. 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీనిపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన శివమ్ దూబె స్థానంలో స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రాణాను ఎలా ఆడిస్తారని వ్యాఖ్యానించాడు.‘నిజానికి మేం ఈ మ్యాచ్‌లో గెలవాల్సింది. కానీ, కంకషన్‌ నిర్ణయం మా ఓటమికి కారణమైంది. ఈ సబ్‌స్టిట్యూట్‌ను మేం అస్సలు అంగీకరించం’ అని జోస్ బట్లర్ అన్నాడు.‘ఇది ఏమాత్రం సరైన రిప్లేస్‌మెంట్ కాదు. శివమ్ దూబేకు హర్షిత్ రాణా అస్సలు సరిపోలే ఆటగాడు కాదు. ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను మేం అంగీకరించం. ఒకవేళ మేం దీన్ని అంగీకరించాలంటే.. శివమ్ దూబే గంటకు 25 మైల్స్ వేగంతో బౌలింగ్ చేయాలి. అదే సమయంలో హర్షిత్ రాణా తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవాలి’ అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.తమను సంప్రదించకుండానే.. భారత జట్టు హర్షిత్ రాణాను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దించిందని బట్లర్ చెప్పాడు. తాను ఔటయ్యాకే హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్ అనే విషయం తెలిసిందని పేర్కొన్నాడు. దీనిపై అంపైర్లను ప్రశ్నించగా, కంకషన్ రిప్లేస్‌మెంట్ అని బదులిచ్చారని బట్లర్‌ వివరించాడు. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్‌తో ఈ విషయంపై మాట్లాడుతామని, మాకు ఉన్న కొన్ని సందేహాలపై స్పష్టత ఇవ్వాలని అడుగుతామని బట్లర్‌ అన్నాడు.

2025-02-01T10:30:20Z