ముంబై : భారత్, ఇంగ్లండ్ మధ్య ఇటీవల ముగిసిన నాలుగో టీ20లో శివమ్ దూబె స్థానంలో బౌలర్ హర్షిత్ రాణాను ‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’గా తీసుకోవడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇంగ్లండ్ మాజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ (జవగళ్ శ్రీనాథ్) భారత్‌కు అనుకూలంగా వ్యవహరించాడని మాజీ మ్యాచ్ రిఫరీ, ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ బ్రాడ్ స్పందించాడు. ఎక్స్ వేదికగా బ్రాడ్ స్పందిస్తూ.. ‘ఇలాంటి పరిస్థితులను నివారించాలంటే మ్యాచ్‌లో ఏ దేశానికీ చెందినవారు కాకుండా స్వతంత్ర మ్యాచ్ రిఫరీలు ఉండాలి.
ఐసీసీ ఎందుకు ఆ పాత పక్షపాత, అవినీతి రోజుల వైపు మళ్లుతోంది? పూణె మ్యాచ్‌లో భారత ఆటగాడిని భర్తీ చేసేందుకు ఒక భారత మ్యాచ్ రిఫరీని ఎలా అనుమతిస్తాడు?’ అని రాసుకొచ్చాడు. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘పూణెలో దూబె హెల్మెట్‌కు బంతి బలంగా తాకినా మ్యాచ్ ముగిసేదాకా బాగానే బ్యాటింగ్ చేశాడు. అతడు కంకషన్ కాలేదు. అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను అనుమతించడం సరైంది కాదని అనిపిస్తోంది. ఒకవేళ వచ్చినా అతడు ఫీల్డింగ్ వరకే పరిమితమవ్వాలే తప్ప బౌలింగ్ చేయాల్సి ఉండకూడదు. ఇలాంటి చర్యల ద్వారా మ్యాచ్ గెలవాల్సిన అవసరం భారత్‌కు లేదు’ అని ఘాటుగానే వ్యాఖ్యానించాడు.
2025-02-03T22:42:10Z