ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌లో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖకు రూ. 3,794.30 కోట్లను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (రూ. 3,442.32 కోట్లు)తో పోలిస్తే తాజా బడ్జెట్‌లో పెరిగింది రూ. 351.98 కోట్లు. క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ ఇప్పించి రాటుదేల్చేందుకు గాను ఏర్పాటు చేసిన ఖేలో ఇండియా కార్యక్రమానికి గాను వెయ్యి కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన పద్దులో కేటాయించారు.
గతేడాది కంటే ఇది రూ. 200 కోట్లు ఎక్కువ. ఇక జాతీయ క్రీడా సమాఖ్యకు రూ. 400 కోట్లు (రూ. 60 కోట్లు అధికం), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రూ. 830 కోట్లు (గతేడాది రూ. 815 కోట్లు) కేటాయిస్తున్నట్టు సీతారామన్ తెలిపారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్)కు 2024-25 కంటే అదనంగా మరో రూ. 200 కోట్లను పెంచి ఏకంగా రూ. 450 కోట్లను కేటాయించడం విశేషం.
2025-02-02T01:11:16Z