కోహ్లీ.. ఆఫ్‌ స్టంప్‌.. అదే కథ

  • రంజీ రీఎంట్రీలో 6 పరుగులకే ఔట్‌

ఢిల్లీ : 2012 నవంబర్‌ తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ తీరు మారలేదు. గత కొంతకాలంగా అతడిని వేధిస్తున్న ఔట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బలహీనతను విరాట్‌ మరోసారి బయటపెట్టుకున్నాడు. ఈ సమస్యను అధిగమించేందుకు సంజయ్‌ బంగర్‌ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుని బరిలోకి దిగిన ఈ రన్‌ మెషిన్‌.. మ్యాచ్‌కు వచ్చేసరికి తేలిపోయాడు. పుష్కరకాలం తర్వాత రంజీ రీఎంట్రీ ఇచ్చిన అతడు 15 బంతులు మాత్రమే ఆడి 6 పరుగులకే నిష్క్రమించాడు. రైల్వేస్‌ పేసర్‌ హిమాన్షు సంగ్వాన్‌ 28వ ఓవర్లో వేసిన ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని వెంటాడబోయిన కోహ్లీ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో అతడి బ్యాటింగ్‌ విన్యాసాలను చూద్దామని అరుణ్‌ జైట్లీ స్టేడియానికి పోటెత్తిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో నిండుగా కనిపించిన స్టాండ్స్‌.. అతడు ఔటైన వెంటనే ఖాళీ అవడం గమనార్హం. ఇదిలా ఉంటే గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన వారిలో కోహ్లీ ముందువరుసలో ఉన్నాడు. రాష్ట్ర జట్టుకు చేసిన సేవలకు గుర్తింపుగా ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) కోహ్లీని శుక్రవారం ఘనంగా సన్మానించింది.

2025-01-31T23:25:50Z