కొంతే కొండంతైనా!

  • తొలి వన్డేలో భారత్‌ విజయం
  • మెరిసిన సిరాజ్‌, షమీ
  • రాణించిన రాహుల్‌, జడేజా
  • రేపు విశాఖలో రెండో వన్డే

బౌండ్రీలు మాత్రమే కొట్టాలని కంకణం కట్టుకుని క్రీజులో అడుగుపెట్టినట్లు.. మిషెల్‌ మార్ష్‌ విధ్వంసం సృష్టించడంతో.. 19 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 124/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. అప్పటికే మార్ష్‌ శతకానికి చేరువ కాగా.. స్టార్‌ ప్లేయర్లు బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో ఆసీస్‌ భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించింది. అయితే ఇలాంటి దశలో మన బౌలర్లు అద్భుతం చేశారు. పట్టపగ్గాలు లేకుండా సాగుతున్న కంగారూల స్కోరుకు కళ్లెం వేస్తూ ఆసీస్‌ను 188 పరుగులకు ఆలౌట్‌ చేశారు!

వాంఖడే పిచ్‌పై ఇంత చిన్న స్కోరు ఛేదించడం ఒక లెక్కా అని భావించిన భారత అభిమానులకు ఐదు ఓవర్లు ముగిసేసరికే దిమ్మ తిరిగింది. బంతి అనూహ్యంగా స్వింగ్‌ అవుతుండటంతో పరుగులు చేయడం కాదు కదా.. బతికి బట్టకడితే అదే పదివేలు అన్న తరహాలో మనవాళ్లు బంతి బంతికి ఓ మహాగండాన్ని ఎదుర్కొన్నారు. రెండో ఓవర్‌లోనే ఇషాన్‌ ఔట్‌ కాగా.. కోహ్లీ, సూర్యకుమార్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ బాట పట్టారు. కాసేపటికి గిల్‌ కూడా వీరిని అనుసరించడంతో టీమ్‌ఇండియా 39/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది!!

ఇంకేముందు టీమ్‌ఇండియాకు పరాభవం తప్పదనుకుంటున్న తరుణంలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిపై ఎదురుదాడి ప్రారంభించగా.. టెస్టు జట్టులో చోటు కోల్పోయిన కేఎల్‌ రాహుల్‌.. వన్డేల్లో తన విలువ చాటుకున్నాడు. లక్ష్యం చిన్నదే అయినా ఆసీస్‌ బౌలర్లు పరీక్షిస్తుండటంతో నింపాదిగా పరుగులు చేశారు. జట్టు కుదురుకుంటున్న సమయంలో పాండ్యా ఔటైనా.. ఆల్‌రౌండర్‌ జడేజా సహకారంతో రాహుల్‌ మ్యాచ్‌ ముగించాడు!!!

రాహుల్‌ యాంకర్‌ ఇన్నింగ్స్‌

స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియాకు షాక్‌ మీద షాక్‌ తగిలింది. ఆసీస్‌ను తక్కువ పరుగులకు ఆలౌట్‌ చేశామనే సంబరంలో ప్రేక్షకులు ఇంకా సీట్లలో కుదురుకోకముందే ఇషాన్‌ కిషన్‌ (3) ఔటయ్యాడు. భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ (20)తో పాటు విరాట్‌ కోహ్లీ ఆదుకుంటారనుకుంటే.. రన్‌మెషీన్‌ కోహ్లీ (4) స్టార్క్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ మరుసటి బంతికే సూర్యకుమార్‌ (0) కూడా అదే తరహాలో ఔట్‌ కాగా.. రాహుల్‌ యాంకర్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.

విరాట్‌ కోహ్లీ నాటు.. నాటు

మైదానంలో తన ఆటతీరుతో పాటు హావాభావాలు, చిలిపి చర్యలతో అభిమానులను ఆకట్టుకునే భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. తాజా పోరులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాటు..నాటు పాటకు కాలు కదిపాడు. ఇటీవల ఆస్కార్‌ పురస్కారం దక్కించుకున్న ఈ పాటలో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ తరహాలో కోహ్లీ స్టేడియంలో స్టెప్పులు వేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 35.4 ఓవర్లలో 188 ఆలౌట్‌ (మిషెల్‌ మార్ష్‌ 81, ఇంగ్లిస్‌ 26; షమీ 3/17, సిరాజ్‌ 3/29), భారత్‌: 39.5 ఓవర్లలో 191/5 (రాహుల్‌ 75 నాటౌట్‌, జడేజా 45 నాటౌట్‌; స్టార్క్‌ 3/49, స్టొయినిస్‌ 2/27)

2023-03-17T19:36:19Z dg43tfdfdgfd