కేఎల్ రాహుల్ సెంచరీ.. టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ బౌలర్లకు మాస్‌ వార్నింగ్..!

టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఇంగ్లాండ్‌ టూర్‌ను ఘనంగా ప్రారంభించాడు. సరైన మ్యాచ్ ప్రాక్టీస్ కోసం.. జట్టు కంటే ముందే ఇంగ్లాండ్‌కు వెళ్లిన అతడు.. ఇండియా-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలిరోజు ఆటలోనే శతకం బాదేశాడు. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన రాహుల్.. తన క్లాస్ ఆటతో మైమరిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 151 బంతుల్లోనే మూడంకెల మార్కును అందుకున్నాడు. దీంతో అసలైన టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ బౌలర్లకు హెచ్చరికలు పంపాడు.

ఈ మ్యాచ్‌ నార్తాంప్టన్ వేదికగా శుక్రవారమే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ లయన్స్.. ఇండియా ఏకు బ్యాటింగ్ అప్పగించింది. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇకపై అతడి స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్లుగానే ఈ మ్యాచ్‌లో రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు.

అయితే 17 పరుగులు చేసిన అనంతరం జైశ్వాల్.. తొలి వికెట్‌ రూపంలో ఔట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11) కూడా త్వరగానే ఔట్ అయ్యాడు. ఈ దశలో కరుణ్ నాయర్ (40)తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. జట్టు స్కోరు 126 వద్ద కరుణ్.. మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న రాహుల్ మాత్రం సాధికారికంగా ఆడాడు.

మంచి బంతులను గౌరవిస్తూ.. చెత్త బంతులను శిక్షిస్తూ స్కోరు బోర్డును ముుందుకు తీసుకెళ్లాడు. 65కు పైగా స్ట్రైక్‌రేట్‌తో రాహుల్ పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే 150 బంతుల్లోనే మూడంకెల మార్కును అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు.. ఆ జట్టుకు హెచ్చరికలు పంపాడు. జురెల్ (50) కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో 55 ఓవర్లకు ఇండియా ఏ 234/3 రన్స్‌తో నిలిచింది. రాహుల్, జురెల్ క్రీజులో ఉన్నారు.

నిజానికి ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్ కోసం భారత జట్టు శుక్రవారం బయలు దేరింది. కానీ బీసీసీఐ పర్మిషన్‌ తీసుకుని రాహుల్.. జట్టుకంటే ముందే ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టాడు. ప్లాన్ ప్రకారం రెండో అనధికారిక టెస్టు బరిలోకి దిగాడు. అనుకున్నట్లుగానే సెంచరీ చేసి.. మంచి మ్యాచ్ ప్రాక్టీస్ పొందాడు.

2025-06-06T16:14:41Z