ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ కెప్టెన్సీ వదిలేశాక అద్భుతంగా రాణిస్తున్నాడు. మోర్గన్ వారసుడిగా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న బట్లర్ మొదటి సంవత్సరంలోనే టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఆ వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్ జట్టు మళ్లీ అలాంటి ప్రదర్శన చేయలేదు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వరకు ఇంగ్లండ్ జట్టు కనీసం లీగ్ స్టేజ్ దాటి వెళ్లింది లేదు.
బట్లర్ కెప్టెన్సీలో భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో అత్యంత దారుణ ఓటములు చవిచూసింది. మ్యాచ్ గెలవడానికి నానా తంటాలు పడింది. ఆ వరల్డ్‌కప్‌లో మొదలైన బట్లర్ పతనం.. మొన్నటి వరకు కొనసాగుతూనే ఉంది. టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ దారుణంగా విఫలమైంది. బ్యాటర్‌గా కూడా బట్లర్ రాణించలేకపోయాడు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ మధ్యలోనే కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు బట్లర్ వెల్లడించాడు.
కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఐపీఎల్‌లో తన సత్తా చాటాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఫస్ట్ డౌన్‌లో దిగిన బట్లర్ 500కు పైగా పరుగులు చేయడమే కాకుండా, మ్యాచ్ విజయాల్లో కీలకంగా మారాడు. గుజరాత్‌ను ప్లే ఆఫ్స్‌కి వెళ్లినా.. బట్లర్ లేకపోవడంతో ఎలిమినేటర్‌లోనే ఇంటి బాట పట్టింది.
ఇంగ్లండ్ జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత తమ దేశం తరఫున మొట్టమొదటి సారిగా వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆడుతున్నాడు. వన్డేల్లో ఓ మాదిరిగా ఆడినా.. టీ20ల్లో మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో రాణిస్తున్నాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఆతిథ్య ఇంగ్లండ్ సిరీస్ సొంతం చేసుకుంది. తొలి టీ20లో 59 బంతుల్లోనే 96 పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రెండో టీ20లో కూడా 36 బంతుల్లో 47 పరుగులు చేసి టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వన్డేల్లో ఐదు, ఆరు స్థానాల్లో దిగుతుండటంతో అంతగా రాణించలేకపోతున్న బట్లర్.. టీ20ల్లో మూడో స్థానంలో వచ్చి అదరగొడుతున్నాడు. మొత్తానికి కెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత బట్లర్ రాత మారిపోయింది.
2025-06-09T07:09:58Z