కీలక ప్లేయర్‌ను వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించిన ఇంగ్లాండ్.. అదే అసలు కారణమా!

వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముందగా వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో కీలకమార్పులు చేసింది. స్టార్ ఓపెనర్, 2019 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లోని సభ్యుడు జేసన్ రాయ్‌పై వేటు వేసింది. అతడి స్థానంలో యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు చోటు కల్పించింది.

ఇంగ్లండ్ జ‌ట్టు మొద‌ట ప్ర‌క‌టించిన‌ ప్రాథమిక జట్టులో రాయ్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ స‌మ‌యంలో అత‌డికి వెన్నెముక ద‌గ్గ‌రి కండ‌రాలు ప‌ట్టేశాయి. దీంతో అతడు సిరీస్‌లో ఆడలేకపోయాడు. వరల్డ్ కప్ నాటికి అతడు కోలుకునే పరిస్థితి లేకపోవడంతో జట్టు నుంచి తప్పించారు. దీంతో ఇంగ్లాండ్ ప్రకటించిన 15 మంది సభ్యులో అతడి ప్లేసులో హ్యారీ బ్రూక్‌ చోటు దక్కించుకున్నాడు.

జట్టు ఎంపిక సందర్భంగా ఇంగ్లాండ్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ల్యూక్ రైట్ మాట్లాడుతూ.. "మేం బలమైన జట్టును ఎంపిక చేశాం. భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ గెలుస్తామనే నమ్మకం ఉంది. వన్డేల్లో ప్రతిభ కలగిన ఆటగాళ్లు మా వద్ద ఉండటం మా అదృష్టం. గాయ‌ంతో బాధపడుతున్న జేస‌న్ రాయ్‌ను త‌ప్పించ‌డం క‌ష్ట‌మైన నిర్ణ‌యమే. కానీ అతడి ప్లేసులో హ్యారీ బ్రూక్ జట్టులోకి వచ్చాడు" అని వ్యాఖ్యానించాడు.

భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ ఇంగ్లాండ్ తరఫున తనకు చివరి టోర్నీ అని ఇటీవల జేసన్ రాయ్ ప్రకటించాడు! ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్టు కూడా రద్దు చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో జేసన్ రాయ్‌ను తప్పించడం చర్చనీయాశంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ జట్టు తరఫున రాయ్ మళ్లీ ఆడకపోవచ్చనే విశ్లేషణులు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ కోసం సైతం.. కెప్టెన్ జోస్ బట్లర్ రాయ్ వైపు మొగ్గుచూపాడని.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. దానికి అనుగుణంగానే జట్టు నుంచి తప్పించిందని సమాచారం.

ఇంగ్లండ్ వ‌ర‌ల్డ్ క‌ప్ జట్టు:

జోస్ బ‌ట్ల‌ర్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మ‌ల‌న్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ క‌ర‌న్, అదిల్ ర‌షీద్, డేవిడ్ విల్లే, రీస్ టాప్లే, మార్క్‌వుడ్, గ‌స్ అట్కిన్స‌న్‌

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే పోరుతో టోర్నీకి తెరలేవనుంది.

2023-09-18T03:43:00Z dg43tfdfdgfd