ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్.. లక్నోలో అట్టహాసంగా నిశ్చితార్థం!

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థ కార్యక్రమం ఆదివారం వేడుకగా సాగింది. లక్నోలో జరిగిన ఈ నిశ్చితార్థంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులతో పాటు బీసీసీఐ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఫ్రాంఛైజీతో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రింకూ సింగ్ టీమిండియాలోనూ చోటు సంపాదించాడు. ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ తన సత్తా చాటాడు. బ్యాటింగ్‌తో పాటు పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా రింకూ రాణిస్తున్నాడు. లక్నోలో జరిగిన రింకూ నిశితార్థ వేడుకకు టీమిండియా క్రికెటర్లు పెద్దగా హాజరుకాలేకపోయారు. టీమిండియా ప్లేయర్లంతా ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో బిజీగా ఉండటంతో రాలేకపోయారు.

రాజకీయ నేపథ్య కుటుంబానికి చెందిన ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ కూడా ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ గత కొద్ది రోజుల కిందటే రింకూ సింగ్ - ప్రియా సరోజ్ పెళ్లి వ్యవహారం గురించి బహిరంగంగా చెప్పాడు. తల్లిదండ్రుల అంగీకారంతోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయన గతంలో చెప్పారు. లక్నోలో జరిగిన నిశ్చితార్థ వేడుకకు అఖిలేష్ యాదవ్‌తో పాటు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా హాజరయ్యారు. వివాహం ఎప్పుడు? ఏంటీ? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.

ఐపీఎల్ 2025లో రింకూ సింగ్ పెద్దగా రాణించలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన రింకూ సింగ్ 29.42 యావరేజ్‌తో కేవలం 206 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియా తరఫున టీ20ల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న రింకూ సింగ్ 46 సగటుతో రాణించాడు. 30 టీ20 మ్యాచ్‌లు ఆడిన రింకూ 22 ఇన్నింగ్స్‌లలో 46.09 యావరేజ్‌ 165.14 స్ట్రయిక్‌రేట్‌తో 507 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండటం కూడా ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తరఫున రింకూ సింగ్ కీ రోల్ పోషించనున్నాడు.

2025-06-08T10:51:35Z