ఎన్సీఏకు వెళ్లిన బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడతాడా?

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్టులో వెన్ను నొప్పితో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. దీంతో అతడు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు. అయితే అతడిని ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడు మళ్లీ మైదానంలోకి ఎప్పుడు దిగుతాడనే విషయంపై స్పష్టత లేదు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత విశ్రాంతిలో ఉన్న బుమ్రా.. ఆదివారం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో అతడు ఉన్నాడు. బుమ్రా గాయం, ఫిట్‌నెస్‌పై.. భారత సెలక్షన్ కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుందట. స్కానింగ్, ఇతర ఫలితాల తర్వాత అతడి రీఎంట్రీపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపిక చేసిన జట్టులో ఫిబ్రవరి 11 వరకు మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్పటిలోపే.. బుమ్రా హెల్త్‌పై అప్‌డేట్ రానుంది. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే.. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఫిట్‌గా మారితే.. ఇంగ్లాండ్‌తో చివరి వన్డేలోనూ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. బుమ్రా లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ వెళ్లాల్సి వస్తే మాత్రం అతడి ప్లేసులో హర్షిత్ రాణా ఫ్లైట్ ఎక్కనున్నాడు. ఫిబ్రవరి 6న ఇంగ్లాండ్‌తో భారత్ తొలి వన్డేలో తలపడనుంది. ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 12 తేదీల్లో 2, 3వ మ్యాచులు జరుగుతాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచులు దుబాయ్ వేదికగా జరుగుతాయి. దీంతో ఈనెల 15న టీమిండియా దుబాయ్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్‌ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌, హార్దిక్ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్‌, కుల్‌దీప్ యాదవ్‌, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌, మహమ్మద్ షమీ, యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా

2025-02-04T06:46:27Z