ఎడ్జ్‌బాస్టన్‌లో ద్విశతకంతో కెప్టెన్‌ కేక.. 269 గిల్‌ డబుల్‌

  • ఎడ్జ్‌బాస్టన్‌లో ద్విశతకంతో కెప్టెన్‌ కేక
  • రికార్డుల దుమ్ము దులిపిన సారథి
  • తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 587 ఆలౌట్‌
  • రెండో టెస్టుపై పట్టు బిగిస్తున్న మెన్‌ ఇన్‌ బ్లూ
  • ఇంగ్లండ్‌ 77/3

బర్మింగ్‌హమ్‌: భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుపై టీమ్‌ఇండియా పట్టు బిగిస్తున్నది. దిగ్గజాల నిష్క్రమణ వేళ ఈ సిరీస్‌కు ముందు టెస్టు సారథ్య పగ్గాలు అందుకున్న కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (387 బంతుల్లో 269, 30 ఫోర్లు, 3 సిక్సర్లు) తన కెరీర్‌లో తొలి ద్విశతకంతో చెలరేగాడు. తొలి రోజు జోరును కొనసాగిస్తూ బర్మింగ్‌హమ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో రికార్డుల దుమ్ము దులిపాడు. గతంలో ఇంగ్లండ్‌లో ఆ దేశంతో ఆడుతూ పెద్దగా ఆకట్టుకోని గిల్‌.. సారథిగా మాత్రం మూడో ఇన్నింగ్స్‌లోనే డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 587 పరగుల రికార్డు స్కోరు చేసింది.

గిల్‌కు తోడు రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్‌ సుందర్‌ (42) రాణించారు. అనంతరం ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. రెండో టెస్టుకు బుమ్రా స్థానంలో వచ్చిన ఆకాశ్‌ దీప్‌ (2/36), హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ (1/21) ఆతిథ్య జట్టును ఆరంభంలోనే దెబ్బకొట్టారు. మూడో రోజు ఉదయం సెషన్‌లో భారత బౌలర్లు ఇదే జోరును కొనసాగిస్తే మ్యాచ్‌ భారత్‌ చేతిలోకొచ్చినట్టే!

జోరు కొనసాగిస్తూ..

ఓవర్‌ నైట్‌ స్కోరు 310/5తో రెండో రోజును ఆరంభించిన భారత్‌.. తొలి సెషన్‌లో జోరు కొనసాగించింది. గిల్‌, జడేజా తొలి రోజు జోరును కొనసాగిస్తూ మొదటి సెషన్‌లో 4 రన్‌రేట్‌కు తగ్గకుండా ఆడారు. వోక్స్‌ ఓవర్లో సింగిల్‌తో జడ్డూ టెస్టుల్లో 23వ అర్ధ శతకం పూర్తిచేశాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో అతడు రెండు బౌండరీలు బాదగా.. కార్స్‌ ఓవర్లో గిల్‌ సైతం బ్యాక్‌ టు బ్యాక్‌ ఫోర్లతో అలరించాడు.

డ్రింక్స్‌ విరామం తర్వాత బషీర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసిన గిల్‌.. టెస్టులలో తొలిసారిగా 150 పరుగుల మార్కును అందుకున్నాడు. అతడే వేసిన మరుసటి ఓవర్లో ముందుకొచ్చి సిక్సర్‌ కొట్టిన జడ్డూ.. శతకం దిశగా సాగాడు. కానీ తర్వాతి ఓవర్లో టంగ్‌ వేసిన బంపర్‌ను అడ్డుకోబోయి వికెట్‌ కీపర్‌ స్మిత్‌ చేతికి చిక్కడంతో అతడి ఇన్నింగ్స్‌ ముగిసింది. జడ్డూ-గిల్‌ ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 203 రన్స్‌ జోడించడం విశేషం.

సారథి ‘డబుల్‌’ కేక

భోజన విరామం తర్వాత గిల్‌.. స్కోరుబోర్డును ముందుకు నడిపించగా సుందర్‌ అతడికి చక్కటి సహకారం అందించాడు. గిల్‌ను ఇరకాటంలో పెట్టడానికి స్టోక్స్‌.. నిరాటంకంగా బషీర్‌కు బంతినిచ్చినా అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. టంగ్‌ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో గిల్‌ ద్విశతకానికి చేరువయ్యాడు. అతడే వేసిన 122వ ఓవర్లో తొలి బంతిని ఫైన్‌ లెగ్‌ దిశగా ఆడి టెస్టులలో మొదటి డబుల్‌ సెంచరీని సాధించాడు. క్రీజులో నిలదొక్కుకున్నాక వాషింగ్టన్‌, ద్విశతకం తర్వాత గిల్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ 500 పరుగుల మార్కును అందుకుంది.

బ్రూక్‌ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో కెప్టెన్‌ 250 స్కోరును అధిగమించాడు. హాఫ్‌ సెంచరీకి సమీపిస్తున్న సుందర్‌.. రూట్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అవడంతో 144 పరుగుల ఏడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. రెండో సెషన్‌లో టీమ్‌ఇండియా 31 ఓవర్లలోనే 145 రన్స్‌ రాబట్టింది. త్రిశతకంపై కన్నేసిన గిల్‌.. టీ విరామం తర్వాత టంగ్‌ బౌలింగ్‌లో షాట్‌ బాల్‌ను ఆడబోయి స్కేర్‌ లెగ్‌ వద్ద ఓలీ పోప్‌కు చిక్కడంతో చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆకాశ్‌ (6), సిరాజ్‌ (8) ను ఔట్‌చేసిన బషీర్‌.. భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

పేసర్ల శుభారంభం

ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌కు ఆరంభ ఓవర్లోనే భారత పేసర్లు చుక్కలు చూపించారు. మూడో ఓవర్లోనే ఆకాశ్‌.. వరుస బంతుల్లో ప్రమాదకర బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌ను డకౌట్‌ చేసి ఆతిథ్య జట్టుకు డబుల్‌ షాకులిచ్చాడు. 8వ ఓవర్లో సిరాజ్‌.. క్రాలీ (19)ని పెవిలియన్‌కు పంపాడు. కానీ రూట్‌ (18*), బ్రూక్‌ (30*) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ సేన ఇంకా 510 పరుగులు వెనుకబడి ఉంది.

  • ఇంగ్లండ్‌లో హయ్యస్ట్‌ స్కోరు చేసిన భారత సారథిగా గిల్‌ నిలిచాడు. గతంలో ఈ రికార్డు అజారుద్దీన్‌ (179) పేరిట ఉండేది.
  • ఇంగ్లండ్‌ గడ్డపై ద్విశతకం చేసిన తొలి భారత కెప్టెన్‌ గిల్‌. ఓవరాల్‌గా ఇంగ్లీష్‌ జట్టుపై వారి దేశంలో ఆడుతూ గవాస్కర్‌, ద్రావిడ్‌ తర్వాత డబుల్‌ సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌. అదీగాక ఇంగ్లండ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఘనతా గిల్‌దే. గవాస్కర్‌ (1979లో 221) రికార్డు కనుమరుగైంది.
  • భారత టెస్టు సారథుల్లో హయ్యస్ట్‌ స్కోరు సాధించిన కోహ్లీ (254*) రికార్డును గిల్‌ అధిగమించాడు.
  • ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు (గతంలో 416 అత్యధికం). మొత్తంగా ఇంగ్లండ్‌లో భారత్‌కు ఇది నాలుగో అత్యధిక స్కోరు.
  • టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యధిక స్కోరు చేసినవారిలో గిల్‌ ఏడో స్థానంలో ఉన్నాడు.

2025-07-03T20:55:51Z