క్రికెట్ గ్రౌండ్‌లో ఊతకర్ర సహాయంతో థర్డ్ మ్యాన్ స్థానంలో ఫీల్డింగ్ చేయడాన్ని ఒకసారి ఊహించుకోండి.
లేదా, వెనుక కాలు కదల్లేదని తెలిసి కూడా బ్యాక్‌ఫుట్‌పై కట్ షాట్ కొట్టడాన్ని మీరు ఊహించగలరా? అసాధ్యంగా అనిపిస్తుంది కదా! కానీ, ఈ సూపర్ వుమెన్‌కు అది అసాధ్యం కాదు.
తస్నీమ్ వయస్సు 26 ఏళ్లు. ఆమె జార్ఖండ్‌లోని వసీపూర్‌లో పుట్టి పెరిగారు. మహిళలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎండలో ఆటలు ఆడటం సురక్షితం కాదని అక్కడ అందరూ భావిస్తారు.
ప్రస్తుతం అందరికీ స్ఫూర్తిగా నిలిచే తస్నీమ్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు.
26 ఏళ్ల లలిత, గుజరాత్‌లోని ఒక గిరిజన గ్రామంలో పుట్టి పెరిగారు. వారిది పేద కుటుంబం. ఇప్పటికీ వారి ఇంట్లో టీవీ లేదు. విద్యుత్ సరఫరా కూడా పరిమితంగానే ఉంటుంది. ఆమె ఇటీవలే ఒక పాపకు జన్మనిచ్చారు.
తస్నీమ్, లలిత దేశంలోని రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు. వీరిలో ఒకరేమో రోజూ క్రికెట్ చూస్తూ పెరిగితే, మరొకరికి అసలు ఆటలను చూసే అవకాశమే ఉండేది కాదు.
కానీ, ఈ రోజు వీరిద్దరూ రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్లేయర్లు. భారత తొలి దివ్యాంగ మహిళల క్రికెట్ జట్టుకు వారు ప్రాతినిధ్యం వహించారు.
క్రికెట్ మాత్రమే కాకుండా వారిద్దరిలో ఉన్న మరో ఉమ్మడి అంశం ఏంటంటే వారిద్దరూ పోలియో బాధితులు.
మహిళలకు కోసం ప్రత్యేకంగా చేపట్టిన ‘బీబీసీ షీ ప్రాజెక్టు’లో భాగంగా ‘ద బ్రిడ్జ్’ మీడియా సంస్థతో కలిసి బీబీసీ ఈ కథనాన్ని మీ ముందుకు తెచ్చింది.
‘‘నేను చిన్నప్పుడు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు పెద్ద అభిమానిని. ఒక మ్యాచ్ కూడా వదలకుండా అన్ని క్రికెట్ మ్యాచ్‌లు చూసేదాన్ని. కానీ, నాకు నా పరిమితులు తెలుసు.
పోలియో కారణంగా స్టేడియంకు వెళ్లి ఒక్క మ్యాచ్ కూడా చూడలేనని అనుకున్నా. ఇక, ఆట ఆడటం అనే విషయాన్ని పక్కకు పెట్టండి. నా జీవితం నుంచి నేనేమీ కోరుకోలేదు. నేను డిప్రెషన్‌లో ఉండేదాన్ని.
కానీ, ఈరోజు నాలో కొత్త ఆత్మవిశ్వాసం వచ్చింది. ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు’’ అని తస్నీమ్ చెప్పుకొచ్చారు.
శారీరక వైకల్యం ఉన్నప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటూ క్రికెట్ ఆడుతున్న తస్నీమ్, లలిత లాంటి మహిళా క్రికెటర్లు భారత్‌లో చాలా మంది ఉన్నారు.
భారత్‌లో 1.2 కోట్ల మందికి పైగా దివ్యాంగ మహిళలు ఉన్నారు. వీరిలో 70 శాతం మంది మారుమూల గ్రామాల్లో ఉంటారు. వారి వైకల్యానికి సహాయంగా ఉండే ప్రాథమిక సౌకర్యాలు లేకుండా వారు జీవనం సాగిస్తున్నారు.
అయినప్పటికీ, ఈ క్రీడాకారిణులు అ అవరోధాలను దాటుకుంటూ క్రికెట్ పట్ల అభిరుచిని కొనసాగించడానికి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.
సామాజిక అవాంతరాలు, సౌకర్యాల లేమి, ప్రయాణ కష్టాలను ఎదుర్కొంటూ తమ కలలను నిజం చేసుకునేందుకు సమాజంలోని ఒక వర్గానికి ప్రేరణగా నిలుస్తున్నారు.
భారత్‌లో మొట్టమొదటి దివ్యాంగ మహిళల క్రికెట్ క్యాంపు 2019లో జరిగింది. బరోడా క్రికెట్ సంఘం సహాయంతో గుజరాత్‌లో ఈ క్యాంపును నిర్వహించారు.
ఈ క్యాంపుకు చీఫ్ కోచ్‌గా నితేంద్ర సింగ్ వ్యవహరించారు. ఆయన దివ్యాంగ మహిళా క్రికెటర్ల గురించి మాట్లాడారు.
‘‘దివ్యాంగ బాలికలకు దృఢ సంకల్పం ఉంటుంది. వారు తమను తాము నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. నిరంతరం అదనపు కృషి చేస్తూ ఏదో సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు’’ అని ఆయన అన్నారు.
ఈ క్యాంపు, చాలా మంది మహిళలకు ఒక కొత్త మార్గాన్ని చూపింది. ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే మహిళా క్రికెటర్లను గుర్తించడంలో ఇది ఉపయోగపడింది. అలాగే భారతదేశపు తొలి దివ్యాంగ మహిళా క్రికెట్ జట్టు ఏర్పాటుకు దోహదపడింది.
కానీ, అప్పటినుంచి ఇప్పటివరకు పెద్దగా పురోగతి కనిపించలేదు. ఇప్పటికీ చాలా రాష్ట్రాలు తమ దివ్యాంగ మహిళా క్రికెట్ జట్టును ఏర్పాటు చేసుకోవడానికి కష్టపడుతున్నాయి.
2021లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), దివ్యాంగ క్రికెటర్ల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పటివరకు వారికి నిధులను కేటాయించలేదు.
దివ్యాంగ క్రికెటర్లకు ఆర్థికంగా మద్దతుగా నిలిచే ప్రభుత్వ పాలసీ ఒక్కటి కూడా లేదు.
ఈ క్రికెటర్లు, క్రీడల కోటాలో ఉద్యోగం పొందడానికి సరైన వ్యవస్థ లేదు.
జాతీయ స్థాయి టోర్నమెంట్లు జరుగుతున్నప్పటి నుంచి పారా బ్యాడ్మింటన్, పారా అథ్లెటిక్స్ వంటి క్రీడాంశాల్లో మెరుగైన అవకాశాలు వస్తున్నాయి. పారాలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఈ క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు ఉద్యోగాలను పొందుతున్నారు.
ఇలాంటి స్పష్టమైన కెరీర్ మార్గం లేనప్పటికీ, కొందరు దివ్యాంగ క్రికెటర్లు తమ అంకిత భావం, పట్టుదలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఆటలో భవిష్యత్ కనిపించనప్పటికీ, గుజరాత్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 15 నుంచి 20 మంది అమ్మాయిలు ప్రతీ ఆదివారం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటారు.
వారిలో ఒకరే 26 ఏళ్ల లలిత. గుజరాత్ రాష్ట్రం దాహోడ్‌లోని ఉమారియా గ్రామానికి చెందిన లలిత, క్రికెట్ ట్రైనింగ్ కోసం 150 కి.మీ దూరంలో ఉన్న వడోదరకు వెళ్తారు.
రెండేళ్ల వయస్సులో లలిత, పోలియో బారిన పడ్డారు. ఆమె ఎడమ కాలు అసలు పనిచేయదు.
అయితే, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన ఫుట్‌వర్క్‌ను ప్రదర్శించకుండా ఆమెను ఆమె వైక్యలం ఆపలేదు. ఆమె చేతికర్ర సహాయంతో బ్యాటింగ్ చేస్తారు. కానీ, క్రీజులో ఆమె స్టాన్స్, బ్యాటింగ్ చేసే తీరు ఇతర ప్రొఫెషనల్ బ్యాటర్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది.
‘‘నేను 2018లో తొలిసారిగా క్రికెట్ చూశాను. నా మొబైల్ ఫోన్‌లో మ్యాచ్ చూశాను. అప్పుడే నాకు క్రికెట్ ఆడాలని అనిపించింది. ఈరోజుకు కూడా క్రికెట్ చూడటానికి మా ఇంట్లో టీవీ లేదు. కానీ, నేను అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలగంటున్నా’’ అని లలిత చెప్పారు. కెమెరా ముందు మాట్లాడటం ఆమెకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది.
లలితకు ఆమె భర్త అండగా నిలిచారు. ఆయన రోజూవారీ కూలీ. లలిత ప్రాక్టీస్ కోసం ఆయన కూడా 8 గంటలు ప్రయాణం చేస్తారు. ఆమె గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నంత వరకు తమ 5 నెలల పాప అవసరాలను ఆయన చూసుకుంటారు.
‘‘మేం ప్రాక్టీస్‌కు వస్తుంటే అందరూ లలిత వేసుకున్న దుస్తులపై కామెంట్ చేస్తుంటారు. గ్రామంలో మహిళలు ఎవరూ ప్యాంట్, టీషర్ట్ వేసుకోరు. నడవడమే రాకుండా క్రికెట్ ఎలా ఆడుతుందంటూ వారు అంటుంటారు. కానీ, మేం ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా వస్తాం. నా భార్య తను అనుకున్నది సాధించి మా అందరికీ గర్వంగా నిలవాలని నేను కోరుకుంటున్నా’’ అని ప్రవీణ్ అన్నారు.
దివ్యాంగ క్రికెట్‌లో కేవలం పరికరాలే కాకుండా వ్యవస్థలో ఇంకా చాలా మార్పులు అవసరం.
ప్రత్యేక ఫీల్డింగ్ ఏర్పాటు, కాళ్లలో వైకల్యం ఉన్న బ్యాటర్ల కోసం రన్నర్లు, ప్లేయర్లకు ఉత్తమ ఫలితాన్నిచ్చేలా పవర్ ప్లే విధానం ఉండాలి.
‘‘వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వంటి కొన్ని కార్యక్రమాల కారణంగా ఈరోజు దేశంలోని కొంతమందికైనా మహిళా క్రికెటర్ల గురించి తెలుసు.
కానీ, మాకు ఒక్క టోర్నమెంట్ ఆడటానికి కూడా సరైన వసతులు లేవు’’ అని భారత తొలి దివ్యాంగ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఆలియా ఖాన్ అన్నారు.
క్రీడల్లోకి వచ్చినందుకు కూడా తాము చిన్నచూపుకు గురవ్వాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘మామూలు అమ్మాయిలే క్రికెట్ ఆడలేరు, అలాంటిది నువ్వు ఒక్క చేయితో క్రికెట్ ఆడాలనుకుంటున్నావా? అని చాలామంది చాలాసార్లు అనడం నేను విన్నాను. మహిళలు ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు చూసుకోవాలి. బయటకు వెళ్లి సమయాన్ని వృథా చేయకూడదని ఈ సమాజం భావిస్తుంది’’ అని ఆమె అన్నారు.
భారత దివ్యాంగ క్రికెట్ నియంత్రణ మండలి (డీసీసీబీఐ) ఇటీవలే మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే, ఈ కమిటీలో పనిచేసే మహిళా అధికారుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
వీరి కంటే అంధ మహిళల క్రికెట్ జట్టుకు దేశంలో కాస్త మెరుగైన మద్దతు లభిస్తోంది. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా (సీఏబీఏ), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అంధుల జట్టుకు నిధులు అందుతున్నాయి.
‘‘నిజానికి ఈ క్రికెట్‌కు మద్దతుగా నిలిచే వ్యవస్థను డీసీసీబీఐ, సీఏబీఐ, బీసీసీఐ కలిసి రూపొందించాలి. ఆటగాళ్లు తమంతట తాముగా ముందుకు వచ్చి ఆడతారు, గెలుస్తారు. కానీ, వారి ఆటను చూసేవారే లేరు. దివ్యాంగులు కూడా అద్భుతమైన ఆట ఆడతారని జనాలకు ఎలా అర్థం అవ్వాలి?’’ అని నితేంద్ర సింగ్ అన్నారు.
తమ తోటి మహిళా క్రికెటర్లు, పురుషులతో సమానంగా కోట్లలో వేతనాలు అందుకుంటూ, తాజాగా లీగ్‌లో కూడా ఆడుతుంటే.. ఈ దివ్యాంగ మహిళా క్రికెటర్లు మాత్రం అలాంటి గుర్తింపు, హోదా తమకు వస్తుందనే ఆశ కూడా లేని పరిస్థితుల్లో ఆటపై మమకారాన్ని చాటుతున్నారు.
ఆట పట్ల తమకు ఉన్న అభిరుచితో శిక్షణ పొందుతున్నారు. సంకెళ్లను తెంచుకునే ధైర్యం లేని ఇతర మహిళల్లో స్ఫూర్తిని నింపేందుకు వారు పోరాడుతున్నారు.
(బీబీసీ షీ సిరీస్ ప్రొడ్యూసర్: దివ్య ఆర్య, బీబీసీ ప్రతినిధి)
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
2023-03-17T11:38:07Z dg43tfdfdgfd