ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. టెస్టు ఫీవర్ స్టార్ట్!

ఇప్పటివరకు ఐపీఎల్‌తో బిజీబిజీగా ఉన్న టీమిండియా ప్లేయర్స్‌లో ఇకపై టెస్టు ఫీవర్ మొదలవ్వనుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడనున్న తొలి టెస్టు సిరీస్ కూడా ఇదే. దాని కోసం నిన్న ముంబై నుంచి బయల్దేరిన టీమిండియా.. ఇవాళ లండన్ చేరుకుంది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 కూడా ఇంగ్లండ్ - ఇండియా సిరీస్‌తోనే ప్రారంభం కానుంది. దాంతో ఈ సిరీస్‌ను ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ, ఈసీబీ సంయుక్తంగా ఆలోచించి టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశాయి. ఈ సిరీస్ కోసం భారత్ ఏ జట్టు ఇప్పటికే ఇంగ్లండ్‌కు వెళ్లగా.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో, గిల్ సారథ్యంలో కూడిన టీమిండియా సీనియర్ జట్టు ఈరోజు అడుగుపెట్టింది.

టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ ఆగస్టు 4 వరకు కొనసాగనుంది. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టెస్టు సిరీస్‌కు ముందు భారత్ ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికార మ్యాచ్‌లు ఆడనుండగా.. ఆ తర్వాత టీమిండియా, టీమిండియా ఏ మధ్య మరో మ్యాచ్ జరగనుంది.

ఇంగ్లండ్-ఇండియా షెడ్యూల్

ఇంగ్లండ్ - భారత్ మధ్య జూన్ 20న తొలి టెస్టు జరగనుంది. లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు జరుగుతుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 2 నుంచి జూలై 6 వరకు రెండో టెస్టు, లండన్ వేదికగా జూలై 10 నుంచి 14 వరకు మూడో టెస్టు, మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు, ఒవెల్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు ఐదో టెస్టు జరగనుంది.

టీమిండియా స్క్వాడ్

అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

ఇంగ్లండ్ స్క్వాడ్

బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాకబ్ బేతెల్, క్రిస్ వోక్స్, ఓలీ పోప్, జెమీ స్మిత్, శామ్యూల్ జేమ్స్ కుక్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్, జాష్ టంగ్, జెమీ ఓవర్టన్.

2025-06-07T07:47:08Z